పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి నటిస్తున్న చారిత్రక చిత్రం ‘హరి హర వీరమల్లు‘. పేరుకు మొఘలుల కాలం నాటి చారిత్రక కథాంశంతో రూపొందుతోన్నా ఇదొక ఫిక్షనల్ డ్రామా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలైంది. అయితే.. కొంత భాగం చిత్రీకరణ పూర్తైన తర్వాత దర్శకుడిగా క్రిష్ తప్పుకున్నాడు. ప్రస్తుతం ఎ.ఎమ్.రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో ‘హరిహర వీరమల్లు‘కి విరామం వచ్చింది. మళ్లీ ఈరోజు నుంచే ఈ చిత్రం షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. విజయవాడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో షూటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ షూట్ లో జాయిన్ కానున్నాడట.
లేటెస్ట్ గా ‘హరిహర వీరమల్లు‘ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. వచ్చే యేడాది మార్చి 28న ‘హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తొలిసారి పవన్ కళ్యాణ్ సినిమాకి కీరవాణి పనిచేస్తుండడం విశేషం. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.