సంక్రాంతికి సిక్స్ కొడుతున్న టాలీవుడ్

సంక్రాంతి వార్ ఫిక్స్ అయిపోయింది. ప్రధానంగా పోటీ అంతా చిరంజీవి, బాలకృష్ణల మధ్యే ఉంటుందని అంతా భావిస్తున్నా.. థియేటర్స్ చేతిలో ఉండటం వల్ల దిల్ రాజు కూడా తన వారసుడుచిత్రాన్ని భారీగానే విడుదల చేస్తున్నాడు. దీంతో వారసుడు హీరో విజయ్ కూడా రేస్ లో ఉంటాడు అని భావించొచ్చు. అయితే ఇంత పెద్ద స్టార్స్ వస్తున్నప్పుడు సాధారణంగా చిన్న సినిమాలు ఆ టైమ్ లో రావడానికి దైర్యం చేయవు. బట్ ఈ సారి నాలుగు పెద్ద సినిమాలతో పాటు రెండు చిన్న సినిమాలు కూడా ధైర్యం చేసి పందెం కోళ్లలా బరిలోకి దిగుతున్నాయి.

దీంతో ఈ సంక్రాంతికి మొత్తం ఆరు సినిమాలు వస్తున్నట్టు కన్ఫార్మ్ అయిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ తో కనిపిస్తోన్న వాల్తేర్ వీరయ్య అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మాట్ లో వస్తోన్న కంప్లీట్ ఎంటర్టైననర్ అని తేలిపోయింది. రవితేజ ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. బాబీ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇప్పటికే వచ్చిన పాటలతో పాటు టీజర్ తో వీరయ్య అంచనాలు భారీగా పెంచాడు అనే చెప్పాలి. వాల్తేర్ వీరయ్యను జనవరి 13న విడుదల చేస్తున్నారు.


ఇక ఇదే నిర్మాతలు రూపొందించిన మరో సినిమా వీర సింహారెడ్డి. జనవరి 12న వస్తోంది. ఈ చిత్రంలోనూ శ్రుతి హాసన్ హీరోయిన్. వరలక్ష్మి శరత్ కుమార్ హీరోకు చెల్లి పాత్రలో కనిపించబోతోంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ సినిమాకు అయితే ప్లస్ లేదంటే మైనస్ అవుతాయని టాలీవుడ్ టాక్. కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపైనా భారీ అంచనాలే ఉన్నాయి.


ఇక సంక్రాంతి బరిలో 12నే మెగాస్టార్ తో పాటు వారసుడుగా వస్తున్నాడు విజయ్. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఇక్కడ వీళ్లు చెప్పుకోవడానికి విజయ్ ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ అంటున్నారు కానీ.. వాళ్లు మాత్రం డబ్బింగ్ సినిమా అనే చెప్పుకుంటున్నారు. పైగా ఆర్టిస్టులు కూడా ఎక్కువగా తమిళ్ వాళ్లే ఉన్నారు. ఇప్పటి వరకూ ప్రమోషన్స్ పరంగా పెద్ద క్రేజ్ అయితే లేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత ఏదైనా హైప్ వస్తుందేమో చూడాలి.


ఇక తమిళ్ నుంచి వస్తోన్న మరో డబ్బింగ్ మూవీ తెగింపు. అక్కడ తునివు పేరుతో రూపొందిన ఈ చిత్రంలో అజిత్ హీరో. మళయాల నటి మంజు వారియర్ ఫీమేల్ లీడ్ చేసింది. ఇంతకు ముందు అజిత్ తో నీర్కొండ పార్వై, వలిమై చిత్రాలు చేసిన హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగులో అజిత్ కు ఏమంత క్రేజ్ లేదు. అతను ప్రమోషన్స కు రాడు. సో ఈ మూవీ మనవారికి పోటీ ఇస్తుందని భావించలేం.


ఇక ఈ బిగ్ స్టార్‌స్ మూవీస్ తో పాటు జనవరి 14న రెండు చిన్న సినిమాలు వస్తున్నాయి. సంతోష్ శోభన్, ప్రియాభవానీ శంకర్ జంటగా నటించిన కళ్యాణం కమనీయం సినిమా ఒకటి. యూవీ కాన్సెప్ట్ అనే బ్యానర్ నుంచి వస్తోన్న ఈచిత్రానికి అనిల్ కుమార్ ఆళ్ల దర్శకుడు. ఇప్పటికైతే పెద్దగా సౌండ్ లేదు. మరి ఆ టైమ్ కు ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో.


దీంతో పాటు 14న వస్తోన్న మరో సినిమా వివాహం. అంటే విద్యా వాసుల అహం అనే మీనింగ్ కూడా ఇచ్చారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించారు. మణికాంత్ గెల్లి డైరెక్ట్ చేసిన ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీ ఈ తరానికి నచ్చుతుందేమో కానీ నచ్చడానికి ముందు చేయాల్సిన ప్రమోషన్స్ మాత్రం వీక్ గా ఉన్నాయి. సో మొత్తంగా ఈ సంక్రాంతి వార్ ఈ ఆరు సినిమాలతో ఫిక్స్ అయింది. ఒకవేళ పెద్ద సినిమాలు బాలేక చిన్న సినిమాలే హిట్ అయిన సందర్భాలు టాలీవుడ్ లో అనేకం. అలాంటి మ్యజిక్ లేమైనా ఈ సారీ జరుగుతాయా అని చూడకుండా అందరూ మెప్పించాలనే కోరుకుందాం.

Related Posts