తెలంగాణ గ్రామీణ ప్రాంత అనుబంధాలు, అలకలను అత్యంత సహజంగా వెండితెరపై చూపించిన సినిమా బలగం. ఈ చిత్రం విడుదలయ్యేంత వరకూ ఇంత పెద్ద చరిత్ర సృష్టిస్తుందని ఎవరికీ తెలియదు. అప్పటి వరకూ కమెడియన్ గా మాత్రమే తెలిసిన టిల్లు వేణు ఇంత గొప్ప ఎమోషనల్ ఎంటర్టైనర్ తీస్తాడని ఊహించలేదెవరూ.

జబర్దస్త్ నుంచి కూడా వచ్చాడు కాబట్టి..ఆ తరహా కామెడీ ఉంటుందేమో అనుకున్నవాళ్ల కర్చీఫ్‌ లుతడిసిపోయేలా ఏడిపించి మరీ పంపించాడు. ఇక దశాబ్దాల క్రితం గ్రామాల్లో తెరలు కట్టి సినిమాలు ప్రదర్శించేవారు.

మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓటిటి రూపంలో అది బలగంతో సాధ్యమైంది. ఈ చిత్రాన్ని అనేక గ్రామాల్లో లార్జ్ స్క్రీన్స్ పెట్టి మరీ ప్రదర్శించారు. అలా మాకూ సినిమా చూపించాలని చాలా గ్రామాల సర్పంచ్ లను గ్రామస్తులు డిమాండ్ కూడా చేశారంటే బలగం ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. దాదాపు అంతా కొత్త నటీ నటులతో అత్యంత తక్కువ బడ్జెట్ లో రూపొందిన బలగం కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అవార్డ్ ల పరంగా ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వేదికలపై అవార్డులు గెలుచుకుంటూనే ఉంది.

మౌత్ టాక్ వల్ల ఈ చిత్రాన్ని చాలామంది థియేటర్స్ లోనే చూశారు. తర్వాత ఓటిటిల్లో చూశారు. దీంతో ఇక టివిల్లో వస్తే ఎవరూ చూడరేమో అనుకున్నారు. కానీ బలగంలోని ఎమోషన్ కు ఎంతోమంది కనెక్ట్ అయిపోయారు. అందుకే ఓ పెద్ద స్టార్ హీరోసినిమా కంటే ఎక్కువ భారీ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుందీ చిత్రం. ఏకంగా 14.3 టీఆర్పీ రేటింగ్ దక్కించుకుందీ చిత్రం. ఈ మధ్య విడుదలైన ఏ స్టార్ హీరో సినిమాకూ ఈ రేంజ్ టీఆర్పీ రాలేదంటే బలగం ఎంత బలంగా జనాల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

, , , , ,