HomeReviews'తంగలాన్' మూవీ రివ్యూ

‘తంగలాన్’ మూవీ రివ్యూ

-

నటీనటులు: విక్రమ్‌, పార్వతి తిరువొత్తు, పశుపతి, మాళవిక మోహనన్‌, డానియల్‌ కాల్టాగిరోన్‌ తదితరులు
సినిమాటోగ్రఫి: ఎ.కిషోర్‌ కుమార్‌
సంగీతం: జి.వి. ప్రకాశ్‌కుమార్‌
ఎడిటింగ్‌: సెల్వ ఆర్‌.కె.
నిర్మాతలు: కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, పా.రంజిత్‌, జ్యోతి దేశ్‌ పాండే
దర్శకత్వం: పా.రంజిత్‌
విడుదల తేది: 15-08-2024

నటుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా ఉంటాడు విక్రమ్. ఇప్పటికే వెండితెరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన విక్రమ్.. తాజాగా ‘తంగలాన్’ అంటూ మరో వైవిధ్యభరిత పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక.. దర్శకుడు పా.రంజిత్ సినిమా అంటేనే ఎంతో విభిన్నతతో ఉంటుంది. అలాంటి పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్, పార్వతి తిరువోత్తు, పశుపతి, మాళవిక మోహనన్ నటించిన ‘తంగలాన్’ చిత్రం ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి.. ఈ సినిమా ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
19వ శతాబ్దం చివరి దశలో బ్రిటిష్ పాలన నేపథ్యంలో కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల చుట్టూ తిరిగే హిస్టారికల్ డ్రామా ఇది. బ్రిటిష్ అధికారి క్లెమెంట్‌(డేనియల్‌)కు బంగారంపై మక్కువ ఎక్కువ. టిప్పు సుల్తాన్ కాలం నాటి పురాతన బంగారు గనుల గురించి విన్నాడు. వాటిని తవ్వడానికి కూలీలు కావాలి. ఆ పనికి అనువైన వారు వేపూరు అనే గ్రామంలోని గిరిజనులే అని తెలుసుకుంటాడు.

ఇక.. తంగలాన్ (విక్రమ్), అతని భార్య గంగమ్మ (పార్వతి తిరువోత్తు)తో పాటు వేపూరు గ్రామంలో నివసిస్తుంటాడు. గ్రామస్తులు తమ భూమిని శ్రమించి పండించినా వాటి ఫలాలు అనుభవించరు. అన్నీ స్థానిక జమీందార్ దక్కించుకుంటాడు. అలాంటి సమయంలో తెల్లదొర క్లెమెంట్‌ వేపూరుకు వస్తాడు. వారిని ఒప్పించి తవ్వకాలు చేయాలని భావిస్తాడు. గ్రామాన్ని పేదరికం నుంచి బయటపెడతాం అంటూ వారిని ప్రలోభ పెడతాడు. ఆ ఊరికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న బంగారాన్ని వెలికి తీయడానికి తనతో వస్తే పెద్ద మొత్తంలో కూలీ ఇవ్వడంతో పాటు బంగారంలో వాటా ఇస్తానని ఆశ చూపుతాడు. అణచివేత, బానిసల జీవితం తట్టుకోలేక తంగలాన్.. క్లెమెంట్ ఆఫర్‌ని అంగీకరిస్తాడు.

కానీ గిరిజనుల్లో ఒక భయం ఉంటుంది. అడవులు, కొండల్లో నివసిస్తూ బంగారాన్ని కాపాడే ఆరతి (మాళవిక మోహనన్) అనే శక్తివంతమైన మాయాశక్తి ఉందనే నమ్మకం వారిది. తన నాయకత్వంలో గిరిజనుల బృందాన్ని తీసుకుని క్లెమెంట్‌తో కలిసి బంగారం కోసం బయలుదేరుతాడు తంగలాన్. మరి.. తంగలాన్‌కు బంగారం దొరుకుతోందా? ఆరతి కథ నిజమేనా? క్లెమెంట్ గిరిజనుల జీవితాల్లో మార్పు తెస్తాడా? అనేది మిగతా కథ.

విశ్లేషణ

ఈ పీరియాడిక్ స్టోరీతో మరోసారి తన విలక్షణతను చాటుకున్నాడు డైరెక్టర్ పా.రంజిత్. తంగలాన్ ఒక చారిత్రక డ్రామా అయినా ఫాంటసీ, మాయాజాలం వంటి అంశాలను ఇందులో చొప్పించాడు. సినిమాలోని పాత్రలు, నేపథ్యం అంతా చాలా రస్టిక్ గా డిజైన్ చేశాడు.

అడవి.. అందులో ఉన్న ఏనుగు కొండ.. దాని వెనుక దాగి ఉన్న బంగారు నిధి.. దాన్ని కాపుకాసే ఆరతి.. ఆమె అతీంద్రియ శక్తులు.. అలాగే గనులకు రక్షణగా ఉండే సర్పజాతి.. బంగారం దక్కించుకునే క్రమంలో తంగలాన్‌ తాతకు నాగజాతికి మధ్య జరిగిన పోరాటం.. అన్నీ సినీప్రియులకు థ్రిల్‌ పంచుతాయి.

తంగలాన్ గా విలక్షణ నటుడు విక్రమ్ ఆహార్యం, నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. అలాగే.. అతని కాస్ట్యూమ్స్, మేకప్ ఎంతో విలక్షణంగా ఉంటాయి. ఇక.. ఎడారి నేపథ్యం, గిరిజనుల దుర్భర జీవితాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు పా.రంజిత్.

ఫస్టాఫ్ లో కథనం అంతా ఆసక్తికరంగా సాగింది. తర్వాతి సన్నివేశం ఎలా ఉంటుంది? అనే ఆసక్తి కొనసాగుతుంది. అయితే.. సెకండాఫ్ లో మాత్రం అలాంటి ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు తక్కువే అని చెప్పాలి. అప్పటికే చాలాసార్లు చూసిన సన్నివేశాలే మళ్లీ మళ్లీ చూసిన అనుభూతి కలుగుతుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
విక్రమ్ ‘తంగలాన్’ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఎమోషనల్ సీన్స్ అయినా, యాక్షన్ సీన్స్ అయినా అద్భుతంగా చేశాడు. పార్వతి, పశుపతి కూడా బాగా చేశారు. మాళవిక మోహనన్ ఆరతి పాత్రకు న్యాయం చేసింది.

పా.రంజిత్ ఎప్పుడూ బీదవర్గాల గొంతుగా మాట్లాడతాడు. సామాజిక చైతన్యం, సమాజంలోని అన్యాయాల మీదే ఆయన సినిమాలుంటాయి. తంగలాన్ కూడా అలాంటి సినిమానే. జీవీ ప్రకాష్ సంగీతం బాగుంది. ఏ కథనమైనా తన శైలికి తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వగల సామర్థ్యం జి.వి. సొంతం. ఏ కిషోర్ కుమార్ కెమెరా పని అద్భుతం. కానీ ఎడిటింగ్ మరింత ట్రిమ్ గా ఉండాల్సింది.

చివరగా
విక్రమ్ లోని నట విశ్వరూపాన్ని ఆవిష్కరించే ‘తంగలాన్’.

రేటింగ్: 2.75/5

ఇవీ చదవండి

English News