HomeMoviesటాలీవుడ్మహేష్ - రాజమౌళి కాంబోలో రామాయణం ఛాయలు!

మహేష్ – రాజమౌళి కాంబోలో రామాయణం ఛాయలు!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ బాబును ఇప్పటివరకు చూడని విధంగా ప్రెజెంట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబును కొంతసేపు రాముడి పాత్రలో చూపించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడనేదే ఆ న్యూస్.

గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్‌ని చూపించి ఎలాంటి హైప్ క్రియేట్ చేశాడో తెలిసిందే. ఇప్పుడు రాముడిగా మహేష్ బాబును చూపిస్తే థియేటర్లు ఊగిపోతాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో రాముడిగా మహేష్ బాబును చూపెట్టే నేపథ్యం వారణాసిలో ఉండనుందని, ఇది సినిమాకు టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించి వారణాసి సెట్‌ను హైదరాబాద్‌లో తీర్చిదిద్దే పనిలో చిత్రబృందం బిజీగా ఉందట.

మహాభారతంను వెండితెరపై ఆవిష్కరించాలన్నది రాజమౌళి కల. కొన్ని భాగాలుగా మహాభారతాన్ని తెరకెక్కించాలని జక్కన్న ఎప్పట్నుంచో భావిస్తున్నాడు. అయితే.. మహాభారతంను తెరకెక్కించడానికి సమయం పడుతుంది కాబట్టి.. ఈలోపులో మహేష్ ప్రాజెక్ట్ లో రామాయణంను కొంత వరకూ చూపించాలనే కోరికతో ఉన్నాడట దర్శకధీరుడు.

మహేష్-రాజమౌళి కాంబో మూవీ.. హాలీవుడ్ ఇండియానా జోన్స్ జానర్ లో సాగనుందనే ప్రచారం ఉంది. ఆద్యంతం అడవులు, నిధుల వేట నేపథ్యంలో ఈ సినిమాని పీరియాడికల్ స్టోరీగా తీర్చిదిద్దబోతున్నాడు రాజమౌళి. ఈ కథలోనే కొంతసేపు శ్రీరాముడుగా కనిపించనున్నాడట సూపర్ స్టార్ మహేష్. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఇవీ చదవండి

English News