నటీనటులు: ధనుష్, సందీప్ కిషన్, కాళిదాసు జయరాం, ఎస్ జే సూర్య, అపర్ణ బాలమురళి, సెల్వ రాఘవన్, శరవణన్ తదితరులు.
సినిమాటోగ్రఫి: ఓం ప్రకాష్
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
ఎడిటింగ్: ప్రసన్న జీకే
నిర్మాతలు: సన్ పిక్చర్స్
దర్శకత్వం: ధనుష్
విడుదల తేది: 26-07-2024
వెర్సటైల్ యాక్టర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తాడు కోలీవుడ్ స్టార్ ధనుష్. ఈతరం యువ కథానాయకుల్లో రెండుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్న ఘనత ధనుష్ సొంతం. కేవలం కథానాయకుడుగానే కాకుండా నిర్మాతగానూ 16 సినిమాలను నిర్మించాడు ధనుష్. వీటిలో చాలా వరకూ విజయాలు సాధించినవే. ఈ జనరేషన్ హీరోలెవరూ సాహసించని రీతిలో దర్శకత్వంలోనూ తన ప్రతిభ చాటుకుంటున్నాడు. తన డైరెక్షన్ లోని డెబ్యూ మూవీ ‘పవర్ పాండి’ భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు రెండో ప్రయత్నంగా రూపొందించిన సినిమా ‘రాయన్‘.
ధనుష్ దర్శకత్వం వహించి హీరోగా నటించిన ‘రాయన్‘ సినిమాలో సందీప్ కిషన్, ఎస్.జె.సూర్య, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి పెద్ద కాస్టింగ్ ఉంది. ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. అసలు సిసలు యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ‘రాయన్‘ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ‘రాయన్‘ ఎలా ఉంది? ఈ రివ్యూ లో చూద్దాం.
కథ
టౌన్ కి వెళ్లొస్తామని చెప్పి వెళ్లిన తల్లి దండ్రులు కనిపించకుండా పోతారు. దీంతో.. చిన్న తనం నుంచే కార్తవ రాయన్ (ధనుష్)కి కత్తి పట్టడం అలవాటు అవుతుంది. తల్లిదండ్రులు కనిపించకుండా పోవడంతో.. తన ఇద్దరు తమ్ముళ్లు (సందీప్‌కిషన్, కాళిదాస్ జయరామ్), చెల్లి (దుషారా విజయన్) ను తీసుకుని చెన్నై లోని అంజనాపురంకి వచ్చేస్తాడు. ఓ మార్కెట్లో పనిచేస్తూ నలుగురూ అక్కడే పెరుగుతారు. అక్కడ దురై (శరవణన్), సేతు (ఎస్.జె.సూర్య) గ్యాంగ్స్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంటుంది. ఆ గొడవలు రాయన్ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేశాయి? తన తమ్ముళ్లు, చెల్లెలు కోసం రాయన్ ఏం చేశాడు? వంటి విశేషాలన్నీ తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
ప్రతీకారంతో రగిలిపోయే రెండు గ్యాంగ్స్ మధ్య గొడవలతో అల్లిన కథలు వెండితెరకు కొత్తేమీ కాదు. ఇప్పటివరకూ వచ్చిన చాలా సినిమాల కమర్షియల్ ఫార్ములా ఇదే. అయితే.. కథ పాతదే అయినా కథనాన్ని ఎంత కొత్తగా ఆవిష్కరించారు అన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది.
‘రాయన్‘ సినిమా విషయానికొస్తే.. కథగా చూస్తే ఇదీ పాతదే. అయితే.. ఈ సినిమాలోని ట్విస్ట్స్, ఫ్యామిలీ డ్రామా.. కథనాన్ని ఆసక్తికరంగా మార్చాయి. సినిమా ప్రథమార్థంలో పాత్రల పరిచయం, ఆ నేర ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు ధనుష్. ఇక.. దురై గ్యాంగ్ నుంచి రాయన్ కుటుంబానికి సవాలు ఎదురవ్వడంతో.. కథలో వేగం పెరుగుతుంది. మంచి ట్విస్ట్ తో విరామం వస్తోంది. ఆ ట్విస్ట్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లడంతో పాటు.. సెకండాఫ్ పై అంచనాలు పెంచింది.
దురై గ్యాంగ్ తో తలపడి గెలిచిన రాయన్.. తోడేల్లాంటి జిత్తుల మారి సేతు గ్యాంగ్ తో ఎలా తలపడ్డాడు.. చివరకి ఏమైంది? అనే ఉత్సుకతతో సెకండాఫ్ కొనసాగుతోంది. కొన్ని యాక్షన్ ఘట్టాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. యాక్షన్ సన్నివేశాలే కాదు.. అన్నా చెల్లెలు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా సరికొత్తగా అలరిస్తాయి.
రా అండ్ రస్టిక్ గా కొనసాగిన కొన్ని సన్నివేశాలు ఓవర్ గా అనిపించినా.. సినిమా కథనాన్ని ధనుష్ నడిపిన విధానం కొత్తగా ఆకట్టుకుంటుంది. ఎస్.జె.సూర్య పాత్రను మలిచిన విధానం బాగుంది. అయితే.. నత్తనడకన సాగే ప్రథమార్థం, సినిమాలోని కొన్ని సన్నివేశాలలో కొరవడిన భావోద్వేగాలు సినిమాకి మైనస్ గా చెప్పొచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటుల విషయానికొస్తే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ధనుష్ గురించే. ఈ సినిమాలో రాయన్ పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. అండర్ ప్లే చేస్తూనే.. అవసరమైనప్పుడల్లా తన హీరోయిజాన్ని ఆవిష్కరించాడు. ధనుష్ తమ్ముళ్లుగా సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఎస్.జె.సూర్య అంటేనే విలక్షణమైన నటుడు. ఈ సినిమాలో తన విలనిజాన్ని చూపిస్తూనే.. ఆద్యంతం నవ్వులు కూడా పంచాడు. ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక పరంగా దర్శకుడు ధనుష్ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ గురించి. చాలా రోజుల తర్వాత రెహమాన్ ఈ సినిమాలో నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. సినిమాలోని కొన్ని సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో బాగా ఎలివేట్ చేశాడు.
చివరగా
ధనుష్ హీరోగా ‘అసురన్‘ (తెలుగులో ‘నారప్ప‘) తర్వాత మళ్లీ అలాంటి విషయం ఉన్న కథతో దర్శకుడిగా కూడా హిట్ కొట్టాడని చెప్పొచ్చు. ఏ.ఆర్. రెహమాన్ నేపథ్య సంగీతం బాగుంది. సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్.జె.సూర్య , ప్రకాష్ రాజ్ మంచి పాత్రలతో మెప్పించారు.
రేటింగ్:3 / 5