పొన్నియన్ సెల్వన్ -2 రివ్యూ

రివ్యూ : పొన్నియన్ సెల్వన్ -2
తారాగణం : విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష, కార్తి, శోభిత ధూళిపాల, ప్రకాష్ రాజ్, ప్రభు, శరత్ కుమార్, జయరాం తదితరులు
ఎడిటింగ్ : ఏ శ్రీకర్ ప్రసాద్
సంగీతం : ఏఆర్ రెహ్మాన్
ప్రొడ్యూసర్స్ : మణిరత్నం, సుభాస్కరన్
దర్శకత్వం : మణిరత్నం

తమిళీయులకు అత్యంత ఇష్టమైన చోళుల పరిపాలన. దానిని వారు స్వర్ణయుగం అని చెప్పుకుంటారు. ఇప్పటికీ తమిళనాట కనిపించే ఎన్నో దేవాలయాలు చోళులు కట్టించినవే. చోళ రాజులను ఆరాధిస్తారు కూడా. ఆ నేపథ్యంలో వచ్చే రచనలైనా, కథలైనా, సినిమాలైనా అత్యంతగా ఆదరిస్తారు. కాకపోతే అవి ఇతర భాషల్లోనే కాస్త కష్టంగా ఉంటాయి. అయినా దర్శకుడు మణిరత్నం కాబట్టి, ఆరిస్టులు బాగా తెలిసిన వాళ్లు కాబట్టి అన్ని భాషల్లోనూ విడుదల చేశారు. ఫస్ట్ పార్ట్ ఇతర భాషల్లో ఆకట్టుకోలేకపోయినా.. తమిళ్ లో మాత్రం అదరగొట్టింది. ఓవర్శీస్ లో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ విడుదల చేశారు. అంచనాలేవీ లేకుండా వచ్చిన ఈ పొన్నియన్ సెల్వన్ 2 ఎలా ఉందో చూద్దాం. మొదటి భాగం చూడని వారికి ఈ భాగం అర్థం కాదు.

కథ :
రాజ్య విస్తరణలో భాగంగా పలు దేశాలపై దండెత్తుతూ వెళ్లిన అరుణ్ మొళి(జయం రవి) సొంత మనుషుల కుట్రవల్లే హత్య ప్రయత్నానికి గురవుతాడు. అతను సముద్రంలో మునిగిపోతుండగా ఓ వృద్ధమహిళ వచ్చి కాపాడుతుంది. అక్కడి నుంచి మొదలైన ఈ రెండో భాగంలో ముందుగా ఆదిత్య కరికాలుడు(విక్రమ్) నందిని(ఐశ్వర్య) మధ్య టీనేజ్ లో సాగే ప్రేమకథతో మొదలవుతుంది. వీరి మధ్య అంత శతృత్వాన్ని ఫస్ట్ పార్ట్ లో చూసిన వారికి ఈ లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది. కానీ ఓ అనాథను రాణిని చేయడానికి అంగీకరించని కరికాలుడి తల్లి ఆమెను ఊరి నుంచి తరిమేస్తుంది. పాండ్యుల పంచన చేరుతుంది. అయితే పాండ్యులు చోళులకు బద్ధ శతృవులు కాబట్టి.. నందిని ఒద్దని వేడుకున్నా వినకుండా చంపేస్తాడు కరికాలుడు. అప్పటి నుంచి ఆమె అతనిపై పగ పెంచుకుంటుంది. మరోవైపు సముద్రం నుంచి కాపాడబడిని అరుణ్ మొళిని శ్రీలంకలోని బౌద్ధ బిక్షువుల వద్దకు చేర్చి చికిత్స చేస్తుంటారు. అతను బతికే ఉన్నాడని వంధ్య దేవుడు(కార్తీ) అందరికీ సమాచారం చెప్పడంతో అందరూ సంతోషంగా ఉన్న టైమ్ లో నందిని.. కరికాలుడిని సామంతుల సమావేశానికి రావాలని స్వయంగా ఆహ్వానం పంపిస్తుంది. మరోవైపు సామంతులు అంతా కలిసి అరుణ్ మొళి, కరికాలుడి బాబాయ్ కి సగం రాజ్యం ఇచ్చి అతన్ని డమ్మీగా చేసి తాము ఆడించాలని కుట్ర చేస్తుంటారు. అది తెలిసీ.. నందిని పిలిచిందని వెళతాడు కరికాలుడు. మరి అక్కడ కరికాలుడికి ఏమైంది. అరుణ్ మొళి రాజ్యానికి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటీ.. ? వంధ్య దేవుడు పై వచ్చిన అభియోగాలేంటీ అనేది మిగతా కథ.

విశ్లేషణ :
కొన్ని కథలు పూర్తిగా చెప్పకపోయినా.. వినకపోయినా నచ్చినట్టు అనిపించవు. ఈ మూవీకి సంబంధించి మొదటి భాగంలో జరిగింది ఇదే. అక్కడ అనేక ప్రశ్నలను అలాగే వదిలేశాడు దర్శకుడు. ఆ ప్రశ్నలకు సమాధానాలు స్థానికులకు దాదాపు తెలుసు కాబట్టి వారికి ఎగ్జైటింగ్ గా ఉంటుంది. తెలియని వారికి బోరింగ్ గా అనిపిస్తుంది. బట్ ఈ రెండో భాగంలో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు దర్శకుడు. దీంతో చాలా తక్కువ టైమ్ లోనే ఫస్ట్ పార్ట్ చూసిన వారు ఈ కథలో లీనమైపోతారు. ఈ సారి ఎమోషనల్ గానూ మెప్పిస్తుంది. యుద్ధాలు మరీ అంతగా రక్తి కట్టకపోయినా.. అసలు చోళ రాజ్యంలో ఏం జరిగింది..? ఎందుకు జరిగింది..? ఈ పరిణామాల వెనక ఉన్నది ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు రావడంతో పాటు ఐశ్వర్య రాయ్ తండ్రికి సంబంధించి రెండు సార్లు వచ్చిన ట్విస్టులు ఆకట్టుకుంటాయి.

విక్రమ్ మరోసారి అద్భుతంగా నటించాడు. సామంతుల సమావేశానికి కడంబూర్ రాజ్యానికి వచ్చి వారు కుట్రలు చేస్తున్న విషయాన్ని చెప్పకనే చెప్పే సీన్ హైలెట్. పైగా తను చనిపోతాడని తెలిసీ అక్కడికి వచ్చాడనే విషయంలో ప్రేక్షకుల్లో సానుభూతిని నింపుతుంది. అలాగే అంత పెద్ద యోధుడు ఓ స్త్రీ ప్రేమకు బానిసగా మారడం స్త్రీ శక్తిని కూడా చూపుతుంది. ఐశ్వర్య పాత్ర ఈ సారి డీటెయిలింగ్ గా ఉంది. తను పాండ్యులకు సాయం చేయడం వెనక ఉన్న తను అనుకున్న కారణం కాక మరోటి తెలియడంతో షాక్ అవుతుంది. కార్తీ మరోసారి తనకే సొంతమైన నటనతో మెప్పించాడు. హంతకుడుగా ముద్రవేయబడి దోషిగా నిలిచే సీన్ లో తను ఏ తప్పూ చేయలేదని అరుణ్ మొళికి కళ్లతోనే చెప్పే సీన్ సూపర్బ్. ఈ సారి త్రిష, శోభిత పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. బట్ ప్రకాష్ రాజ్ పాత్రలోని మరో కోణాన్ని బాగా ఆవిష్కరించారు.

అన్ని సంఘటనల వెనక అతనే ఉన్నాడన్నది బాగా ఎస్టాబ్లిష్ అయింది. చోళుల స్నేహితుల్లానే ఉన్నా.. చివరికి కరికాలుడి మరణం తర్వాత పల్లవులు, రాష్ట్ర కూటులు కూడా పాండ్యుల్లా మారడం వారిని అరుణ్ మొళి, వంధ్యదేవుడు కలిసి అంతం చేయడంతో కథ ముగుస్తుంది. ఆ తర్వాత చోళులు తమ రాజ్యాన్ని సముద్రాలు దాటి విస్తరించారని టెక్ట్స్ గా చూపించాడు మణిరత్నం అది నిజమే అంటూ.. ఇప్పటికీ మలేసియా, వియత్నాం దేశాల్లో చోళుల కళలు, సంప్రదాయాలు, శిల్పాకృతులూ కనిపించడం చారిత్ర ఆధారంగా చెప్పుకుంటారు.


ఆర్టిస్టులుగా అందరూ అదరగొట్టారు. ఎవరికి వారు ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. ఎవరినీ తక్కువ, ఎక్కువ అని చెప్పలేం. ఫస్ట్ పార్ట్ లో అనిపించదు కానీ.. ఈ సారి మాత్రం వారు మనకు ఆదిత్య కరికాలుడు, అరుణ్ మొళి, వంధ్య దేవుడు, నందిని ల్లాగానే కనిపిస్తుండటం విశేషం. అంటే నటులుగా అంత బలమైన ముద్ర వేశారన్నమాట.


ఇక లోపాలేం లేవా అంటే ఫస్ట్ నుంచీ ఉన్నట్టుగా ఈ చరిత్ర మనకు పూర్తిగా తెలిసింది కాదు. ఆ రాజులు, రాజ్యాల పేర్లూ పూర్తిగా అపరిచితం. అందుకే కాస్త కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. అయినా ఈ సారి మరీ ఎక్కువ సాగదీతలు లేకుండా ఎమోషనల్ గానూ వర్కవుట్ అయ్యేలా కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు మణిరత్నం.


టెక్నికల్ గా ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం బావుంది. సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఎడిటింగ్ పరంగా కాస్త వేగం పెంచాల్సింది అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ లలో క్లైమాక్స్ లో బాహుబలిని గుర్తు చేసినా.. విజువల్ ఎఫెక్ట్స్ ఆ స్థాయిలో లేవు. తనికెళ్ల భరణి తెలుగు మాటలు బావున్నాయి. ఆర్ట్ వర్క్, సెట్స్, కాస్ట్యూమ్స్ అన్నీ బాగా స్టడీ చేసి తయారు చేసినట్టు ఉన్నాయి. అందుకే సహజంగా కనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎక్కడా రాజీపడ్డట్టు కనిపించదు.

ఫైనల్ గా : పొన్నియన్ సెల్వన్.. రాజ్య కాంక్షే రాజులకు ఆభరణం అనే మాటకు వివరించే ప్రయత్నం చేసిన సినిమా.

రేటింగ్ : 2.5/5

                    -బాబురావు. కామళ్ల

Related Posts