నేచురల్ స్టార్ గా తిరుగులేనిఇమేజ్ తెచ్చుకున్నాడు నాని. ఆ ఇమేజ్ తోనే ఇండస్ట్రీలో 15యేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నాడు. ఇన్నేళ్లలో ఎన్నో విజయాలున్నాయి. అతనికంటూ ప్రత్యేకంగా పెద్ద ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ తరం హీరోల్లో నానికి ఉన్నంత ఫ్యామిలీ ఆడియన్స్ మరే హీరోకూ లేరంటే అతిశయోక్తి కాదు. నాని సినిమా అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే చూస్తారు మనవాళ్లు. అందుకే అతన్ని ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా అభిమానిస్తారు. ప్రతి యేడూ రెండు నుంచి మూడు సినిమాలువిడుదలయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు నాని. అందుకే చాలా త్వరగానే 30వ సినిమా మైలు రాయిని చేరుకున్నాడు.

ప్రస్తుతం అతను నటిస్తోన్న హాయ్ నాన్న సినిమా అతనికి 30వది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ చైల్డ్ సెంటిమెంట్ తో సాగే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. శౌర్యు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు.హాయ్ నాన్నను కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్ లోనే విడుదల చేయబోతున్నారు.

హాయ్ నాన్న తర్వాత నాని వరుసగా కొన్ని ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు. అందులో ముందుగా వచ్చేది వివేక్ ఆత్రేయ సినిమా. వీరి కాంబినేషన్ లో ఇంతకు ముందు అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. మంచి కాన్సెప్టే కానీ ఎందుకో మనవాళ్లకు నచ్చలేదు. అయినా నాని అతన్ని మరోసారి నమ్మాడు. అయితే ఈ సారి క్లాస్ కాదు. మాస్ అంటున్నారు. యస్.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఈ సారి వచ్చే సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అట. పైగా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల చేస్తాం అని చెబుతున్నారు. నాని రీసెంట్ మూవీ దసరాను కూడా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గానే విడుదల చేశారు. బట్ ఈ మూవీ ఇతర భాషల్లో ఏ ఇంపాక్ట్ చూపించలేదు. అయితే ఈ సారి అలా కాదు అంటున్నారు.

దసరా మాస్ మూవీ అయినా యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పలేం. ఆ లోటును వివేక్ ఆత్రేయ సినిమాతో భర్తీ చేయబోతున్నాడట నాని. అంటే ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం. బడ్జెట్ కూడా భారీగా ఉంటుందట. ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ వాల్డ్ హిట్ అందుకున్న డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. మొత్తంగా నాని ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను మరోసారి ఛేదించే ప్రయత్నం చేయబోతున్నాడన్నమాట.