దశాబ్దాలుగా చెక్కుచెదని స్టార్ డమ్ ను సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ వంటి లెజెండరీ యాక్టర్స్ కే సాధ్యం. సంవత్సరాల తరబడి బాక్సాఫీస్ ను ఏలుతున్న ఈ వెటరన్ యాక్టర్స్ ఇద్దరూ ఇప్పుడు ఒకే వేదికను పంచుకునే అవకాశం రాబోతుందట. నటసింహం నిర్వహించే ‘అన్ స్టాపబుల్’ షోకి మెగాస్టార్ అతిథిగా హాజరవ్వబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది.
ఆహా టాక్ షో ‘అన్ స్టాపబుల్’ కోసం తనలోని హ్యూమర్ యాంగిల్ ని బయటకు తీయడం బాలయ్య స్టైల్. ‘అన్ స్టాపబుల్’ షో ని ఆద్యంతం తనదైన స్టైల్ లో పంచ్ లతో.. హ్యూమర్ తో హృద్యంగా నడిపిస్తూ.. ఇండియాలోనే నంబర్ వన్ గా నిలిపాడు బాలయ్య. ఇప్పటికే పూర్తైన ‘అన్ స్టాపబుల్’ మూడు సీజన్లలో టాలీవుడ్ నుంచి టాప్ సెలబ్రిటీస్ ఎంతోమంది సందడి చేశారు. ముఖ్యంగా.. వీరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజ రవితేజ వంటి వారితో.. బాలకృష్ణ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఇప్పుడు ‘అన్ స్టాపబుల్’ నాల్గవ సీజన్ కి రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే నాల్గవ సీజన్ ను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారట ఆహా నిర్వహకులు. ఇక.. కొత్త సీజన్ తొలి ఎపిసోడ్ లోనే మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరుకానున్నాడట. చిరంజీవితో పాటు.. ఈ కొత్త సీజన్ లో కింగ్ నాగార్జున కూడా పాల్గొంటాడనే ప్రచారం ఉంది. మొత్తంమీద.. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై స్టార్ వార్ అనే పదానికి కేరాఫ్ గా నిలిచిన చిరు, బాలయ్య లు ఒకే వేదికపై సందడి చేస్తే.. ఇరువురి అభిమానులకు పండగే పండగ.