HomeReviews'లక్కీ భాస్కర్' రివ్యూ

‘లక్కీ భాస్కర్’ రివ్యూ

-

నటీనటులు: దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి, రాంకీ, మానస చౌదరి, హైపర్‌ ఆది, సూర్య శ్రీనివాస్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: నిమేశ్‌ రవి
సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: వెంకీ అట్లూరి
విడుదల తేది: 31-10-2024

దీపావళి కానుకగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల తేదీ ఖరారు చేసుకుంది ‘లక్కీ భాస్కర్’. అయితే.. ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ రూపంలో ప్రేక్షకుల్ని పలకరించింది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రచార చిత్రాలతో ఎంతగానో ఆకట్టుకున్న ‘లక్కీ భాస్కర్’ ఎలా ఉంది? దుల్కర్ ఖాతాలో మరో హిట్ పడిందా? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
ముంబై నగరంలోని భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ఒక సాధారణ మధ్య తరగతి యువకుడు. బ్యాంకులో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడు.. ఇలా అందరి బాధ్యత తానే తీసుకుంటాడు. చాలీచాలని జీతంతో ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు.

ప్రమోషన్ పొందాలనే ఆశతో ఎంతో కష్టపడుతుంటాడు. అయితే అతని కష్టానికి తగిన ఫలితం దక్కదు. ఉత్తమ ఉద్యోగిగా పేరున్నా ప్రమోషన్ మాత్రం రాదు. ఈ పరిస్థితుల్లో కుటుంబం కోసం ఏ రిస్క్ తీసుకున్నా తప్పు లేదని భావిస్తాడు. కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతను తీసుకున్న ఆ రిస్క్ ఏమిటి? అది అతడి జీవితంలో ఎలాంటి మలుపులకు దారి తీసింది? అనేది మిగతా కథ.

విశ్లేషణ
తెలుగు తెరపై బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్, భారతీయ మధ్య తరగతి జీవితం వంటి విషయాలను ఆసక్తికరంగా కలిపి చెప్పిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. 90ల దశకంలో భారతీయ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన హర్షద్ మెహతా కుంభకోణం ఈ సినిమాకు ప్రేరణ. ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న భాస్కర్ తన కుటుంబాన్ని పోషించడానికి చేసే ప్రయత్నాలు, అతను ఎదుర్కొనే సవాళ్లు, తీసుకునే రిస్కులు ఈ చిత్రంలో ప్రధాన అంశాలు.

సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు భాస్కర్ అనే బ్యాంకు ఉద్యోగి జీవితం చుట్టూనే తిరుగుతుంది. తన కుటుంబాన్ని పోషించడానికి చేసే ప్రయత్నాలు, ఎదురయ్యే సమస్యలు, తీసుకునే రిస్కులు, చివరకు ఒక పెద్ద స్కామ్‌లో ఇరుక్కున్న తీరు అన్నీ చాలా ఆసక్తికరంగా చిత్రీకరించాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి.

కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. తన స్నేహితుడి సహాయంతో భాస్కర్ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తాడు. అక్కడ అతను తీసుకునే ప్రతి రిస్క్ అతని జీవితంలో మలుపు తిప్పేలా ఉంటుంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులు భాస్కర్ జీవితంలో లీనమవుతారు. అతని కుటుంబం, స్నేహితులు, అతని చుట్టూ ఉన్న వాతావరణం అన్నీ చాలా రియలిస్టిక్‌గా చిత్రీకరించాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి.

అయితే.. ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. స్టాక్ మార్కెట్ గురించి తెలియని వారికి కొన్ని సన్నివేశాలు అర్థం కాకపోవచ్చు. కొన్ని చోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
దుల్కర్ సల్మాన్ పోషించిన భాస్కర్ పాత్ర చాలా ఆకట్టుకుంటుంది. ఒక సాధారణ మనిషిగా ప్రారంభమైన భాస్కర్, క్రమంగా ఒక తెలివైన మోసగాడిగా మారతాడు. భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం దుల్కర్ సల్మాన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒక మధ్యతరగతి కుటుంబపు మనిషిగా, తన భార్య, కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండే వ్యక్తిగా ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది.

మీనాక్షి చౌదరి ఈ సినిమాలో భాస్కర్ భార్యగా సుమతి పాత్రలో చాలా బాగా నటించింది. ఆమె పండించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. దుల్కర్ తో పాటు మీనాక్షి పాత్ర కూడా కథలో చాలా ముఖ్యమైనది. ఇంకా.. రాంకీ, సచిన్ ఖేడేకర్, టినూ ఆనంద్, సాయికుమార్ వంటి నటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికంగా వెంకీ అట్లూరి రచన ఈ సినిమాకు ప్రధాన బలం. కథానాయకుడు డబ్బు కోసం ఆట మొదలు పెట్టడానికి ముందు, ఆట ఆపేయడానికి ముందు భావోద్వేగాలు చాలా బలంగా పండాయంటే కారణం అతని రచనలో బలమే. ఈ సినిమాలోని డైలాగ్స్ కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమాకు మరో బలం. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు జి.వి. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోశాడు. పాటలు కూడా సందర్భోచితంగా సాగుతూ, కథలో ఇమిడిపోయాయి. కెమెరా, ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ వంటి విభాగాలు చాలా బాగా పనిచేశాయి. ముఖ్యంగా 90ల దశకంలోని ముంబై వాతావరణాన్ని చాలా అద్భుతంగా సృష్టించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ప్రొడక్షన్ వేల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలోని ప్రతీ ఫ్రేము ఎంతో అథెంటిక్ గా, రిచ్ గా ఉంది.

చివరగా
ఒక సాధారణ మనిషి అసాధారణ కథే ‘లక్కీ భాస్కర్’. షేర్ మార్కెట్ స్కామ్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలి కథను బాగా చెప్పి హిట్టు కొట్టాడు దర్శకుడు వెంకీ అట్లూరి. దుల్కర్ -భాస్కర్ గా, మీనాక్షి చౌదరి – సుమతి పాత్రలలో బాగా నటించారు. ఈ దీపావళి కి ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా.

Telugu70mm Rating – 3.25/5

ఇవీ చదవండి

English News