జానపద బ్రహ్మ విఠలాచార్య జయంతి

నెలల తరబడి వర్కింగ్ డేస్.. వందల కోట్ల బడ్జెట్.. హై టెక్నాలజీని తోడు చేసుకుని ఇప్పుడెంతో మంది విజువల్ వండర్స్ ను క్రియేట్ చేస్తున్నారు. కానీ కేవలం 3,4 లక్షల బడ్జెట్, 60,70 వర్కిండ్ డేస్ లోనే అద్భుతమైన వెండితెర మాయాజాలాలను సృష్టించిన దర్శకుడు విఠలాచార్య. మంత్రాలు, పరకాయ ప్రవేశాలు, వింత పక్షలు, జంతువులు, అస్థిపంజరాలు.. ఇలా మన ఊహకు అందని ఎన్నిటినో వెండితెరపై ఆవిష్కరించిన జానపద బ్రహ్మ విఠలాచార్య జయంతి నేడు (జనవరి 28).

ఎన్నేళ్లు గడిచినా విఠలాచార్య సినిమా అంటే మనకో అందమైన జ్ఞాపకం. మహేంద్రజాలంలో మనల్ని ఊయలలూగించిన ఓ మాయాజాలం. తెలుగువారి జానపద చిత్ర ఆస్తిగా పేరు తెచ్చుకున్న విఠలాచార్య పుట్టింది కర్ణాటక రాష్ట్రంలో. సినిమాల్లోకి రాకముందు ఆయన ఓ సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలనా చూసుకునే ఉద్యోగం చేసేవారట. అందుకే ఆయన చిత్రాల్లో వాటికీ చాలా ప్రాధాన్యం ఉండేది.

జానపద నాయకుడంటే ఇలాగే ఉంటాడేమో అన్నట్టుగా ఉండే ఎన్టీఆర్ పరిచయంతో విఠలాచార్య వీరవిహారం చేశారు. అందుకు ఎన్టీఆర్ మాస్ హీరో ఇమేజ్ మరింతగా ఉపయోగపడటంతో వీరి కాంబినేషన్లో 16 సినిమాల వరకూ వచ్చాయంటే ఆశ్చర్యం కలగక మానదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘బందిపోటు, మంగమ్మ శపథం, అగ్గిపిడుగు, చిక్కడు దొరకడు, పిడుగు రాముడు, ఆలీ బాబా 40 దొంగలు‘ ఇలా ప్రతీ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఎన్టీఆర్ తో పాటు కాంతారావుతోనూ పలు జానపద సినిమాలు తీసి విజయాలు సాధించారు విఠలాచార్య.

ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న ట్రెండ్, అలాగే ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో స్ప్రెడ్ అవుతోన్న ట్రెండ్ సినిమా ఓపెనింగ్ రోజునే రిలీజ్ డేట్ చెప్పడం. కానీ ఈ విషయంలో అందరికీ ఆద్యుడు విఠలాచార్య. తను తీస్తున్న సినిమాల విడుదల డేట్స్ విషయంలో పక్కాగా ఉంటూ.. ఓపెనింగ్ రోజునే రిలీజ్ డేట్ చెప్పిన తొలి దర్శకుడు విఠలాచార్యే. నిజంగా ఆ రోజుల్లో ఇది ఓ సాహసమే.

Related Posts