జమున లైఫ్ జర్నీ1936 నుండి 2023 వరుకు…

జమున .. ఆమె గ్లామర్ కి డంగయ్యి… అప్పట్లో హలో మేడమ్ సత్యభామా అంటూ పాటలు కట్టారు సినీ కవులు. నన్నుదోచుకుందువటే అంటూ కాసేపు పాడి తెగ ఫీలయ్యాడు ఎన్టీఆర్. కనులు మూసినా నీవాయే అని చాలా చాలా హాపీగా బాధపడ్డాడు ఏఎన్నార్. చేతులు కలసిన చప్పుట్లూ మనసులు కలసిన ముచ్చట్లూ అంటూ ఆమె చెలులతో చేరి పాడుతుంటే… తన్మయంలోకి జారిపోయారు ఆకాలపు ఆడియన్సు. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పటి స్టన్నింగ్ బ్యూటీ ఆమె. ఇన్నేసి ఇమేజినేషన్స్ ను మూడక్షరాల్లో బంధించుకున్న నటి జమున.. ఈ పేరుతో తెలుగు సినిమాకు ఎంతటి అనుబంధం ఉందో అందరికీ తెలుసు. తొలి తరం గ్లామర్ తారల్లో ఒకరిగా ఆమె ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అల్లరి పిల్లగా, గడుగ్గాయిగా, ప్రేయసిగా, బాధ్యత కలిగిన ఇల్లాలుగా.. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో తనదైన ముద్ర వేసిన గ్రేట్ యాక్ట్రెస్ జమున. ఓ చిన్న ప్రమాదం ఆమెలోని గొప్ప నటిని మనకు ఎక్కువ సినిమాల్లో చూపించకపోయినా.. నేటికీ సినిమాకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నారామె.


జమున పుట్టింది కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో. తల్లిదండ్రులు తెలుగువారే. ఆమె బాల్యం గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలలో గడిచింది. సినీ నటుడు జగ్గయ్యది కూడా అదే ఊరు. దీంతో ఆ కుటుంబంతో జగ్గయ్యకు అనుబంధం ఏర్పడింది. ఆయనే జమునను నటనవైపు తీసుకువెళ్లారు. అప్పట్లో నాటకాల ద్వారా జమునను ఆ రంగానికి పరిచయం చేశారు జగ్గయ్య. నాటకాల్లో జమున పేరు మార్మోగిపోయింది. ఖిల్జీ రాజ్య పతనం అనే నాటిక నటిగా ఆమెకు తొలి వేదికనిచ్చింది.. ఆ నాటికలో గుమ్మడి కూడా నటించడం విశేషం.. జమున ప్రతిభ పది మందిలోకి ఫాస్టుగా పాకడంతో ఆమెకు వెండితెర అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. పుట్టిల్లు ఆమె ఫస్ట్ మూవీ. అక్కడి నుంచీ సినీ రంగాన్ని తన పుట్టిల్లుగా చేసుకుని జమున చాలా దూరమే ప్రయాణించింది. చూడగానే కళ్లు మిరుగొట్లుగొలిపే స్టైలూ… యాక్టింగ్ లో అదరగొట్టే ఫెర్ఫామెన్స్ హొయలూ… ఎంతటి టఫెస్ట్ కేరెక్టరయినా ఫట ఫటలాడించే టాలెంట్… ఇంకాస్త స్ట్రైట్ గా చెప్పాలంటే… స్వీటు హాటు కలబోస్తే .. క్లాస్ మాసు మిక్స్ చేస్తే అది జమునవుతుందా… అనిపించేది. అందుకే ఆనాటి ప్రేక్షకులకు ఆమె ఆరాధ్య నటిగా మారింది. తనతో ఎంతటి మహానటులు నటిస్తున్నా… ఏమాత్రం బెదరక యమా యాక్టివ్ యాక్ట్ రెస్ గా పేరు పొందిన వయ్యారి జమున.జమున ఫీచర్స్ ను స్పష్టంగా చూస్తే ఆమె కళ్లే ఆమె ఎస్సెట్ అని తెలుస్తుంది. ఆ కళ్లతోనే సత్యభామగా ఎన్టీఆర్ లాంటి మహానటుడ్ని సైతం హడలగొట్టింది. అందుకే నేటికీ, ఏనాటికీ మన తెలుగు వారికి శ్రీకృష్ణుడంటే ఎన్టీవోడు ఎలాగో సత్యభామంటే జమునా అలాగే. అందుకే నాటి అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి లెజండరీలతో ఎన్నో పాత్రలు పోషించినా… బాగా పేరు తెచ్చిన పాత్ర మాత్రం సత్యభామదే. సత్యభామగా మరొకర్ని వూహించుకోలేం అన్నంతగా పాపులర్ అయిపోయింది జమున. వినాయక చవితి చిత్రంలో తొలిసారి సత్యభామ పాత్రలో మైమరిపించింది జమున. ఆ తరువాత కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీకృష్ణతులాభారం మూవీలో పోషించిన సత్యభామ పాత్ర మరింత మంచి పేరు తెచ్చి ఈ మాట సత్యమే… వేస్తే భామ వేషం ఈ భామే వేయాలన్నంతగా టాక్ తెచ్చేసుకుంది జమున.


అప్పట్లో హీరోకి ఎంత ప్రాధాన్యం ఉండేదో హీరోయిన్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉండేది. భార్యగా, ప్రేమికురాలుగా, తల్లిగా, చెల్లిగా అనేక చిత్రాల్లో నటించి ఆయా సినిమాల విజయాల్లో తన పాత్రకు ఎంతో గౌరవాన్ని ఆపాదించారు జమున. ఎన్నో సాంఘిక చిత్రాల్లో హీరోయిన్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన జమున… కష్టమైన పాత్రల్లోనూ ఇష్టంగా నటించి మెప్పించారు. అహంకారం నిండిన భార్యగా, చలాకీ పల్లెటూరి పిల్లగా ఇలా ఎలాంటి కేరెక్టర్ లోనైనా ఒదిగోపోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.
ఇక గుండమ్మ కథ లాంటి సినిమాలో పొగరుబోతు యువతిగా ఆ తర్వాత మనసస్సు మార్చుకున్న ఇల్లాలిగా ఆమె నటన ఎంతో మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది. జమున ప్రత్యేకత అదే. పాత్రను బట్టి అందులోకి పరకాయ ప్రవేశం చేయగలదు. అందుకే ఒక్కోసారి ప్రేక్షకులు తిట్టుకునేలా నటించే ఆమే.. తర్వాత వారితో కంటతడి పెట్టించడంలోనూ ఆకట్టుకుంటుంది.


జమున శృంగారరసం పోషించడంలో ఎంతో ప్రత్యేకత చూపిస్తుంది…. ఈ రసపోషణలో ఆమె మార్క్ ఆమెదే. మిస్సమ్మ, గుండమ్మకథల్లో జమున చేసిన అందాలా మాయాజాలానికి నాటి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే అవన్నీ అంతర్ సౌందర్యాలు. గులేభకావళికథ, ఇల్లరికం, లేతమనసులూ, మూగనోము… వంటి సినిమాల్లో వారెవ్వా జమున అని అనిపించిన నాయిక ఆమె. ఒక్కో సినిమాలో ఒక్కోరకంమైన సమ్మోహన మంత్రం వేస్తూ ఆడియన్స్ ని అవలీలగా బుట్టలో పడేస్తూ వచ్చిన గ్లమరస్ యాక్ట్రస్ జమున.
మిస్సమ్మలో అందరికంటే చిన్నపిల్లగా ఆనాడే ఫ్యూచర్ స్టార్ గా ముద్రవేసుకుని, గుండమ్మ కథలో పొగరుబోతుగా అలరించి, అటుపై గులేబకావళి కథలో ఎంతో చాతుర్యం ప్రదర్శించే అందాల మాయవిగా జమున నటనకు అచ్చెరువొందడం తప్ప ఏం చేయలేం. ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపడం జమునకు నాటకాల నుంచి తెలిసిన విద్య.


అలాగే మూగనోము చిత్రంలోని పాత్రా ప్రత్యేకమైనదే. టీచర్ ట్రయినింగ్ పూర్తి చేసుకుని వూరు చేరే అమ్మాయి. మార్గమధ్యంలో హీరోగారితో పరిచయం… ప్రేమగా మారుతుంది. అక్కడి నుంచి కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో.. అన్ని మలుపుల్లోనూ జమున తన నటనతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.మూగమనసులు సినిమాలోని గోదారి గట్టుందీ పాటను తెలుగువారెవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. కానీ ఈ పాట కోసం ఎండలో కాళ్లు బొబ్బలెక్కేలా శ్రమించింది జమున. ఆ సినిమాలోనే గౌరిగా గోదారి యాసలో మాట్లాడుతూ నాటి ప్రేక్షకులను ఉర్రూతలూపింది.


కొన్నేళ్లు గడిచాక, కొంత వయసు వచ్చాక.. ఆమె మెల్లిగా మెచ్యూర్డ్ పాత్రల వైపు మళ్లారు. ఆ తర్వాతే జమున చీరలు ఆ రోజుల్లో బాగా పాపులర్ అయ్యాయి. జమున చీరలంటూ బయట బోర్డులు పెట్టి మరీ అమ్మేవారు. కృష్ణ నిర్మించిన పండంటి కాపురం చిత్రంలో జమున పోషించిన రాణీ మాలినీ దేవి పాత్ర ఆమె కెరీర్ కో అద్భుతమైన ఫినిషింగ్. దేవిక, ఎస్వీ రంగారావు, గుమ్మడి వంటి మహామహులతో పోటీ పడి మరీ నటించింది. అలాగే బాపు తీసిన సంపూర్ణ రామాయణంలో జమున పోషించిన కైక పాత్ర ఓ అద్భుతమే..
స్వతహాగా ఆత్మాభిమానం మెండుగా ఉన్న జమున ప్రవర్తన ఆ రోజుల్లో ఇద్దరు అగ్రహీరోలకు నచ్చలేదు. దీంతో ఓ మూడేళ్ల పాటు ఆ ఇద్దరినీ ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోకుండా బాయ్ కాట్ చేశారు. షూటింగ్ లకు లేటుగా వస్తుందనే కారణాలు చూపినా.. తమ ముందే కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది.. మేమంటే భయం లేదు అనేది వారికే తెలిసిన నిజం. అయితే ఆ ఇద్దరిలో ఒక్కరికే ఈ పద్ధతులు నచ్చలేదనేవారూ ఉన్నా.. ఆ మూడేళ్లు ఆమె ఇతర హీరోల సినిమాల్లో, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించిందే తప్ప.. ఏనాడూ వారిని వేశాల కోసం అడగలేదు.. అందుకే ఆమెను గడుగ్గాయి అని కూడా అంటారు.


లేత మనసులు తమిళ రీమేక్ చేస్తున్నప్పుడు అక్కడ నటించిన ఓ కొత్త హీరో చేసిన తప్పిదం వల్ల జమున మెడకు పెద్ద దెబ్బ తగిలింది. షూటింగ్ ఆపేసి తాత్కాలికంగా వైద్యం చేయించారు. కానీ కొన్నాళ్ల తర్వాత ఆ దెబ్బి తిరగబెట్టింది. మరోవైపు సినిమా పరిశ్రమలో కూడా సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ పరిణామాలు, ఈ మెడనొప్పి కారణంగా చివరగా ఎన్టీఆర్ చేసిన అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీ రామపట్టాభిషేకం చిత్రాల్లో నటించిన తర్వాత వెండితెరకు దూరమైంది.


సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు రావడానికి ముఫ్ఫైయేళ్ల ముందే ఏ రాయితీలు లేకుండా హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని స్థిరపడింది జమున. ఆమె భర్త శ్రీ వెంకటేశ్వర యూనివర్శీటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. కొన్నాళ్ల క్రితం ఆయన మరణించారు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు జమున. ఇక హైదరాబాద్ లో సినిమాకు సంబంధించి ఏ ఫంక్షన్ జరిగినా.. ఆమెకు పిలుపు ఉంటే వెంటనే వచ్చేస్తున్నారు. ఏదేమైనా తెలుగు తెరపై జమున పేరును ఎన్నటికీ చెరగని సంతకం. ఆమె మరింత కాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ తెలుగువారి అభినవ సత్యభామకు అంతిమ నివాళులు అర్పిద్దాం ..

     యశ్వంత్ బాబు..

Related Posts