2022లో హయ్యొస్ట్ కలెక్షన్స్ సినిమాలు ఇవే..

2022కు వీడ్కోలు పలికేశాం. పాత కేలండర్ పక్కనబెట్టేసి కొత్త కేలండర్ గోడకు బిగించాం. నిన్న నేడు తిరిగి రాకపోవచ్చు. బట్ అది ఇచ్చిన జ్ఞాపకాలు పదిలంగానే ఉంటాయి కదా…? 2022 అలాంటి మెమరీస్ ను టాలీవుడ్ కు బానే ఇచ్చింది.

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధికంగా ఈ యేడాది 297 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇది ఏ ఇండస్ట్రీకీ సాధ్యం కాని రికార్డ్. ఇక కలెక్షన్స్ పరంగా ఆశించినంత లేకపోయినా.. ఉన్నంతలో టాప్ అనిపించుకున్న మూవీస్ కూడా ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏంటీ.. 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రాలేంటీ అనేది ఈ స్పెషల్ లో చూద్దాం..


ఇండియాస్ టాప్ డైరెక్టర్ బరిలో ఉన్నప్పుడు ఆ టాప్ ప్లేస్ మరొకరికి ఎలా వెళుతుంది. అందుకే 2022లో హయ్యొస్ట్ కలెక్షన్స్ తో టాప్ ప్లేస్ లో నిలిచాడు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 1131 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఈ కలెక్షన్స్ తో పాటు తెలుగువారి సత్తాను కూడా ప్రపంచానికి చాటిందీ చిత్రం.

ఎన్టీఆర్, చరణ్ ల నటనకు ప్రపంచం ఫిదా అయిపోయింది. దేశం మొత్తం వారికి అభిమానులుగా మారింది. అయితే ఈ మూవీకి దగ్గరగా వచ్చే చిత్రం మరోటి లేకపోవడం కాస్త ఆశ్చర్యమే అయినా.. ఆ తర్వాత ప్లేస్ లో సూపర్ స్టార్ మహేష్‌ బాబు సర్కారువారి పాట నిలవడం విశేషం. పరశురామ్ డైరెక్షన్ లో కీర్తి సురేష్‌ హీరోయిన్ గా వచ్చిన ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. అయినా 219 గ్రాస్ వసూలు చేసి సత్తా చాటింది. మహేష్‌, కీర్తిల పెయిర్ కు మంచి స్పందన వచ్చింది.


ఆంధ్రప్రదేశ్ లో కావాలనే టికెట్ రేట్లు తగ్గించినా.. రిలీజ్ టైమ్ లో ఇబ్బంది పెట్టినా పవన్ కళ్యాణ్‌ భీమ్లా నాయక్ మూడో స్థానంలో నిలిచింది. 161కోట్ల గ్రాస్ వసూలు పవన్ స్టామినాను ప్రూవ్ చేసింది. మళయాల బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కొషియమ్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. రానా మరో ప్రధాన పాత్రలో నటించాడు.

నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఓ రకంగా టికెట్ రేట్ల గొడవ లేకుంటే ఈ మూవీ మరో యాభై కోట్లకు పైనే కలెక్ట్ చేసి ఉండేదంటారు విశ్లేషకులు. ఇక విడుదలైన అన్ని భాషల్లోనూ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ప్రభాస్, పూజాహెగ్డేల రాధేశ్యామ్ కలెక్షన్స్ పరంగా నిరాశపరిచినా.. ఈ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. 152 కోట్ల గ్రాస్ వసూలు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఈ మూవీ బడ్జెట్ తో పోలిస్తే ఈ కలెక్షన్స్ కాక సినిమాకు మళ్లీ అంతే మొత్తంలో నష్టం వచ్చిందని చెబుతారు.


ఇక 2022లో హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో అనూహ్యంగా ఎంటర్ అయింది కార్తికేయ2. 2014లో వచ్చిన కార్తికేయకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ లో నటించింది. తెలుగులో రిలీజ్ టైమ్ లో ఇబ్బంది పడిందీ చిత్రం. హిందీలో చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే మూవీ టాక్ చూసిన తర్వాత ఊహించని రేంజ్ లో వెయ్యికి పైగా థియేటర్స్ వచ్చాయి. అలా అనెక్ట్‌స్ పెక్టెడ్ గా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా మారిన కార్తికేయ2 ఫుల్ రన్ లో 124కోట్ల గ్రాస్ వసూలు చేసి నిఖిల్ ను ప్యాన్ ఇండియన్ హీరోగా నిలిపింది. ఇక ఆశించినంత పెద్ద విజయం కాకపోయినా మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ కూడా వంద కోట్ల క్లబ్ లో చేరింది.

మళయాల బ్లాక్ బస్టర్ లూసీఫర్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం 114కోట్ల గ్రాస్ వసూలు చేసి హిట్ గా గట్టెక్కింది. ఇక చివరి స్థానంలో ఉన్న చిత్రం వంద కోట్ల క్లబ్ లో కి ఎంటర్ కాకపోయినా.. మంచి వసూళ్లే సాధించింది. ఆ చిత్రం సీతారామం. దుల్కర్ సాల్మన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీ వందకు దగ్గరగా వచ్చిన 98కోట్ల దగ్గర ఆగిపోయింది. అయితే విమర్శకులకు ఓ రేంజ్ లో నచ్చింది. చాలాకాలం తర్వాత తెలుగులో వచ్చిన అద్బుతమైన ప్రేమకావ్యంగా ప్రశంసలు అందుకుందీ చిత్రం. మొత్తంగా 2022లో హయ్యొస్ట్ కలెక్షన్స్ తో వంద కోట్లు దాటిన సినిమాలు ఇవే. విడుదలైన సినిమాల సంఖ్యతో పోలిస్తే.. ఇవి చాలా తక్కువ. బట్ ఈ సారి ఆ సంఖ్య పది రెట్లు పెరగాలని కోరుకుందాం..

Related Posts