‘గుంటూరు కారం’ రివ్యూ

నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, జగపతిబాబు, రఘుబాబు, ఈశ్వరి రావు, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు
సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: నవీన్ నూలీ
మ్యూజిక్: తమన్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
విడుదల తేదీ: 12-01-2024

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ‘అతడు, ఖలేజా’ వంటి సినిమాల తర్వాత పుష్కర కాలం గ్యాప్ తీసుకుని మళ్లీ ఇప్పుడు ‘గుంటూరు కారం’ సినిమాతో వచ్చారు వీరిద్దరు. మరి.. మహేష్ ను ఈసారి త్రివిక్రమ్ ఏరీతిన ఆవిష్కరించాడు. ‘గుంటూరు కారం’ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ అంచనాలు అందుకోవడంలో సఫలమైందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
గొడవల్లో తలదూర్చుతున్నాడనే నెపంతో భర్త రాయల్ సత్యం (జయరామ్), పదేళ్ల కొడుకు రమణ (మహేష్ బాబు)లను వదిలేసి తండ్రైన జనదళం పార్టీ అధినేత వైరా వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) పంచన చేరుతుంది వసుంధర (రమ్యకృష్ణ). భర్తను జైళ్లో పెట్టించి మరో పెళ్లి చేసుకుంటుంది. తండ్రి రాజకీయాలను వారసత్వంగా తీసుకుని వసుంధర మంత్రి పదవి సంపాదిస్తుంది. అయితే.. వసుంధర మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం గురించి మీడియా ముందు బయటపెడతానని కాటా మధు (రవిశంకర్) బెదిరిస్తూ ఉంటాడు. అందుకే.. రమణ కు, వసుంధరకు ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్ మీద సంతకం చేయించాలని ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తుంటాడు తాత వైరా వెంకటస్వామి.

అసలు రాయల్ సత్యం కు వసుంధర ఎందుకు దూరమైంది? కన్న కొడుకును వదిలేసి వెళ్లిపోవడానికి కారణాలేంటి? అమ్ము (శ్రీలీల) ఎవరు? ఆమెకు రమణకు సంబంధం ఏంటి? చివరకు తల్లీకొడుకులు కలిశారా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
కుటుంబ బాంధవ్యాలకు పెద్ద పీట వేస్తూ తన మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో సినిమాని తీర్చిదిద్దడం త్రివిక్రమ్ స్టైల్.ఈ సినిమాలోనూ అవే ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలంటే ‘అత్తారింటికి దారేది, అల.. వైకుంఠపురములో’ చిత్రాల టెంప్లేట్ లో ‘గుంటూరు కారం’ సాగుతోంది. ‘అల.. వైకుంఠపురములో’ తరహాలోనే ఈ సినిమాలోనూ మదర్ సెంటిమెంట్ ను సెంట్రల్ పాయింట్ గా తీసుకున్నాడు త్రివిక్రమ్.

‘గుంటూరు కారం’ కథ విషయానికొస్తే తల్లి కోసం వెతుక్కుంటూ వెళ్లే కొడుకు కథ అని చెప్పొచ్చు. అయితే.. త్రివిక్రమ్ కథనాన్ని నడిపిన విధానం ఎక్కడా బోర్ కొట్టించదు. మహేష్, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్, శ్రీలీలతో రొమాంటిక్ ట్రాక్స్ బాగా కుదిరాయి. సినిమా మొత్తంలో పాత పాటలను ఓ థీమ్ లా వాడుకున్నాడు మాటల మాంత్రికుడు. ఫైట్స్ లోనూ అవే బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తూ కొత్త దనాన్ని తీసుకొచ్చాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:
త్రివిక్రమ్ తో పనిచేసినప్పుడల్లా తనలోని కొత్త యాంగిల్ బయటకు వస్తోంది అని మహేష్ బాబు చెబుతుంటాడు. మహేష్ అన్నట్టే ఈ మూవీలో సూపర్ స్టార్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. మహేష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉన్నాయి.గుంటూరు స్లాంగ్ లో మహేష్ చెప్పే డైలాగ్స్, ఆయన మేనరిజమ్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా అంతా మహేష్ ఒన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.

శ్రీలీల డ్యాన్సులకు, గ్లామర్ షో కే పరిమితమైనట్టు కనిపిస్తుంది. మరదలు పాత్రలో మీనాక్షి చౌదరి క్యారెక్టర్ అంతగా ప్రభావం చూపించదు. ఇక.. త్రివిక్రమ్ గత కొన్ని చిత్రాల నుంచి అమ్మ, అత్త పాత్రలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాడు. ఈ సినిమాలో అమ్మగా రమ్యకృష్ణకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో.. అత్త పాత్రలో కనిపించిన ఈశ్వరి రావు రోల్ ను అంతే ప్రధానంగా తీర్చిదిద్దాడు. పక్కా గుంటూరు స్త్రీ పాత్రలో ఈశ్వరి రావు మాండలికం బాగుంది.

ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాత్రల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. రాజకీయాలలో నిలదొక్కుకోవడానికి కన్న కూతురు జీవితాన్ని కూడా పణంగా పెట్టడానికి వెనుకాడని క్యారెక్టర్ అది. ఇలాంటి పాత్రలు ప్రకాష్ రాజ్ కి కొట్టినపిండి. వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడు. జయరామ్, జగపతిబాబు, రావు రమేష్, రఘుబాబు, సునీల్, అజయ్, అజయ్ ఘోష్ వంటి నటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే దర్శకుడిగా తన మార్క్ చూపించిన త్రివిక్రమ్.. రచయితగా కథ విషయంలో ఇంకాస్త కసరత్తులు చేస్తే బాగుండేది. తమన్ సాంగ్స్, బి.జి.ఎమ్. ఫర్వాలేదనిపిస్తాయి. మనోజ్ పరమహంస విజువల్స్ బాగున్నాయి. నిర్మాత చినబాబు నిర్మాణ విలువలు ప్రతీ ఫ్రేములో కనిపిస్తాయి.

చివరగా:
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ‘గుంటూరు కారం’ ఓ మాస్ జాతరే అని చెప్పొచ్చు. సంక్రాంతి సీజన్ కూడా కలిసి రావడంతో ఈ సినిమా కలెక్షన్లకు ఢోకా లేదు. అయితే.. లాంగ్ రన్ లో రమణ గాడి మాస్ జాతర ఏ రేంజులో ఉంటుందనేది చూడాలి.

TELUGU70MM Rating – 3/5

Related Posts