కస్టడీ

తారాగణం : నాగ చైతన్య, కృతిశెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్,వెన్నెల కిశోర్, ప్రియమణి, సంపత్ కుమార్, రవివర్మ, రమణ గోపరాజు తదితరులు
ఎడిటర్:వెంకట్ రాజేన్
సినిమాటోగ్రఫీ : ఎస్ఆర్ కథిర్
సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
దర్శకత్వం: వెంకట్ ప్రభు

కస్టడీ.. పవర్ ఫుట్ టైటిల్. నాగ చైతన్య సినిమాకు ఈ టైటిల్ అనౌన్స్ అయినప్పటి నుంచీ ఆసక్తిగానే ఉంది. తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో చేస్తోన్న సినిమా కావడంతో అంచనాలూ ఉన్నాయి. ట్రైలర్ లో ప్రొఫైల్ గాఉన్నా.. ప్రమోషన్స్ తో హైప్ చేశారు. కృతిశెట్టి హీరోయిన్ గా అరవింద్ స్వామి విలన్ గా నటించిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ శుక్రవారం విడుదలైంది. మరి కస్టడీ అంచనాలను అందుకుందా.. లేదా అనేది చూద్దాం.

కథ :
శివ(నాగ చైతన్య) ఓ సాదారణ కానిస్టేబుల్. రేవతి(కృతిశెట్టి) అనే యువతిని చిన్నప్పటి నుంచీ ప్రేమిస్తాడు. రేవతి ఇంట్లో ఈ పెళ్లికి ఒప్పుకోరు. తనకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటారు. దాన్ని ఆపి ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తోన్న టైమ్ లో సడెన్ గా ఓ రాత్రిపూట.. బాగా తాగిన రాజు అనే వ్యక్తి శివ స్కూటర్ ను గుద్దేస్తాడు. అతనితో పాటు మరోవ్యక్తీ ఉంటాడు. ఆ ఇద్దరినీ స్టేషన్ లో వేస్తాడు శివ. అయితే రాజుతో పాటు ఉన్న వ్యక్తి సిబిఐకి చెందిన వాడు. అతను చెప్పగా ఈ రాజు ఓ కరడుగట్టిన క్రిమినల్ అని తెలుస్తుంది. అతను సిబిఐ వాడే అని కన్ఫార్మ్ చేసుకుంటాడు శివ. అదే టైమ్ రాజును చంపాలని సిఎమ్ ఆదేశిస్తుంది. దీంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా రాజును చంపేందుకు పోలీస్ స్టేషన్ కు వస్తారు. కానీ అతన్ని ఎలాగైన నెక్ట్స్ డే బెంగళూరు సిబిఐ కోర్ట్ కు తీసుకువెళ్లేందుకు సిబిఐ ఆఫీసర్ తో కలిసి బాధ్యత తీసుకుంటాడు శివ. మరి శివ లవ్ మేటర్ ఏమైంది..? ఈ రాజు బ్యాక్ గ్రౌండ్ ఏంటీ..? అతన్ని చంపమని సి.ఎమ్ ఎందుకు చెబుతుంది..? అంతమందిపోలీస్ లను దాటుకుని ఓ సాధారణ కానిస్టేబుల్ అయిన శివ అతన్ని కోర్ట్ లో హాజరు పరిచాడా లేదా అనేది మిగతా కథ..

విశ్లేషణ :
కొన్ని కథలు చూస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్నా చాలా సినిమాలు గుర్తొస్తుంటాయి. కాకపోతే కథనం కొత్తగా ఉంటుంది. ఈ కస్టడీ విషయంలోనూ అదే జరిగింది. ఆరంభం సాధారణంగా ఉంటుంది. ఎప్పుడైతే రాజు పాత్రగా అరవింద్ స్వామి ఎంటర్ అవుతాడో.. అప్పటి నుంచీ కథనంలో వేగం పెరుగుతుంది. పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘమైన ఫైట్ సీన్ తర్వాత రాజును సిబిఐ ఆఫీసర్ తో పాటు కోర్ట్ కు తీసుకువెళ్లేందుకు ముందుకు వస్తాడు శివ. అయితే ఈ ప్లాట్ అంతా లోకేష్ కనకరాజ్ ఖైదీ చిత్రాన్ని గుర్తుకు చేస్తుంది. అందులో పోలీస్ లను కాపాడేందుకు ఓ ఖైదీ ముందుకు వస్తాడు. ఇందులో ఓ క్రిమినల్ ను కోర్ట్ లో హాజరుపరిచేందుకు పెద్దగా సంబంధం లేని శివ ముందుకు వస్తాడు. ఇదీ ఒకే రాత్రిలో ఫినిష్ అయిపోయే కథే. అలాగే ఖైదీలో ఆఖర్లో వచ్చే మిషన్ గన్ ఎపిసోడ్ ఇందులోనూ కనిపిస్తుంది.


ఇక శివ ఆ క్రిమినల్ విషయంలో ఎందుకు అంత పట్టుదలగా ఉన్నాడు అని చెప్పేందుకు ఉపయోగించిన సబ్ ప్లాట్ కూడా బాద్ షా చిత్రంలో ఉన్నదే. తన అన్న ఓ టెర్రర్ ఎటాక్ లో చనిపోతే.. ఎన్టీఆర్ బాద్ షాల మారి టెర్రరిస్ట్ లను అంతం చేస్తుంటాడు. ఇక్కడా తన అన్న ఓ క్రిమినల్ యాక్టివిటీలో చనిపోయాడన్న కారణంగా శివ అంత స్ట్రాంగ్ గా ఈ నిర్ణయం తీసుకుంటాడు. అయితే ఫస్ట్ హాఫ్ లో అరగంట తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఒక వైపు పోలీస్ లు.. మరోవైపు శివ, రాజు, తన లవర్.. వారి నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలు.. అన్నీ మరీ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి అని చెప్పలేం కానీ.. గ్రిప్పింగానే ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత ఇంక సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ఊహించుకుంటారు. ఇక్కడే ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేశాడు దర్శకుడు.


ఓ నటోరియస్ క్రిమినల్ ను చంపేందుకు సాక్షాత్తు సిఎమ్ రాత్రంతా మెలకువతో ఉండి ఫోన్ లు చేస్తూ పోలీస్ లను అలెర్ట్ చేస్తుందంటే.. దాని వెనక ఏదో పెద్ద కథే ఉంటుందనుకుంటారు. బట్ ఆ ప్లాట్ చాలా అంటే చాలా సింపుల్ గా చూపించాడు. దీంతో శివ చేసిన సాహసాలు, రాజు త్యాగం అన్నీ సిల్లీగా అనిపిస్తాయి. నిజంగా సిఎమ్ స్థాయి వ్యక్తి మరీ అంత చీప్ గా ఉంటారనుకోలేం. ఇది 90 చివర్లో జరిగిన కథగా చూపించారు. కాబట్టి అలా చేశారు అనుకున్నా.. అదీ అస్సలేమాత్రం ఎఫెక్టివ్ గా ఉండదు. అంత పెద్ద రేస్ జరిగిన తర్వాత ఇంత బలహీనమైన ప్లాట్ తో అంతా తేలిపోతుంది. పైగా సెకండ్ హాఫ్‌ లో చాలా సన్నివేశాలు అవసరమే లేదు అనిపిస్తుంది. ముఖ్యంగా స్టేట్ పోలీస్ లు, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ టీమ్ మధ్య ఇంత పగ ఉంటుందా అనిపిస్తుంది. అది నేటి ఏపి/ తెలంగాణ రాజకీయాలను చూపించినట్టు అనిపిస్తుంది. ఏదేమైనా సెకండ్ హాఫ్ లో రాంకీ ఎపిసోడ్ బలవంతంగా ఉంటుంది తప్ప ఏ మాత్రం అతకలేదు. సిబిఐ ఆఫీసర్ రజిత కోసం రాంకీని దించారు కానీ.. ఈ రెండూ కథకు ఏ మాత్రం ఉపయోగపడని.. అనవసరమైన ఎపిసోడ్స్. సిబిఐ చీఫ్ తనయుడు కొడుకు హాస్పిటల్ లో ఉన్నాడన్న సీన్ తో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు.


ఇక ఇంత సీరియస్ కథలో హీరోయిన్ ను కూడా యాడ్ చేయడం కొంత వరకూ బానే ఉంది కానీ.. ఆ పాత్రను సరిగ్గా రాయలేదు దర్శకుడు. దీంతో కృతి సినిమా మొత్తం కనిపిస్తుంది కానీ సినిమాకు ఏ మాత్రం ప్లస్ కాలేదు. ఏదేమైనా ఓ సాధారణ కానిస్టేబుల్ అసాధారణమైన మిషన్ ను తలకెత్తుకున్నప్పుడు అతను ఓ అద్భుతాన్ని ఛేదించబోతున్నాడు అనో లేక.. రాష్ట్రాన్ని కుదిపేసే అంశం ఏదో ఉంటుందని.. ఉండాలని భావించిన ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచాడు దర్శకుడు. దీంతో ఫస్ట్ హాఫ్‌ హ్యాపీగా బావుంది అనిపించినా.. సెకండ్ హాఫ్ లో వచ్చే విపరీతమైన యాక్షన్ ఎపిసోడ్స్ మధ్య అసలు కథ పలచన కావడంతో పాటు ఎమోషనల్ గా కనెక్షన్ కుదరక ప్రేక్షకులు సినిమా నుంచి డీవియేట్ అవుతారనేది నిజం. అసలు ఓ మామూలు డిఎస్పీ, క్రిమినల్ తో కలిసి సిఎమ్ నేరాల్లో భాగస్వామి కావడమే(ఎంత 90ల్లో జరిగే కథ అయినా) అవుట్ డేటెడ్ కాన్సెప్ట్.


నటన పరంగా నాగ చైతన్య చాలా హానెస్ట్ గా చేశాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టాడు. ఆ సీక్వెన్స్ లను కూడా నేచురల్ గా కంపోజ్ చేశారు. చైతూ ఇమేజ్ కు కూడా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి. కృతి పాత్ర వీక్ గా ఉన్నా.. నటనతో డామినేట్ చేసే ప్రయత్నం చేసింది. అంటే తను చాలా మెరుగయ్యిందని చెప్పొచ్చు. నెక్ట్స్ అరవింద్ స్వామికే పూర్తి మార్కులు. తెరపై కనిపించినంత సేపూ అదరగొట్టాడు. అతని ప్రెజెన్స్ కథనాన్ని పరుగులు పెట్టించింది. చైతూతో కలిసి చేసిన ఫైట్స్ కూడా విజిల్స్ కొట్టిస్తాయి. నటోరియస్ క్రిమినల్ అయిన అతను అప్రూవర్ గా మారడానికి తమ్ముడి ఎపిసోడ్ బావుంది. ప్రియమణిది గెస్ట్ తరహా పాత్ర. శరత్ కుమార్ ఈ తరహా పాత్రలు చాలానే చేశాడు. చైతన్య తండ్రిగా గోపరాజు రమణకు రొటీనే అయినా గుర్తుండిపోయే పాత్ర దక్కింది. వెన్నెల కిశోర్ తనదైన శైలిలో నవ్వించాడు. మిగతా నటులంతా ఎవరిపరిధి మరకు వాళ్లు చేసుకుంటూ వెళ్లిపోయారు.


టెక్నికల్ గా ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం హైలెట్. సాధారణ సన్నివేశాన్ని కూడా నెక్ట్స్ లెవల్ లో నిలిపారు. బట్ పాటలు పూర్తిగా మైనస్. అసలు పాటలు ఇచ్చింది వీళ్లేనా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అంత వీక్ గా ఉన్నాయి. నెక్ట్స్ సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది. అండర్ వాటర్ ఎపిసోడ్స్ తో పాటు నైట్ ఫైట్స్ లో మంచి లైటింగ్ ఉంది. 90ల కాలానికి తగ్గట్టుగా ఆర్ట్ వర్క్, సెట్స్ బావున్నాయి. తెలుగు మాటలు ఓకే. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. దర్శకుడుగా వెంకట్ ప్రభు తనపై ఉన్న అంచనాలను అందుకున్నాడు అని చెప్పలేం. స్క్రీన్ ప్లే బేస్డ్ గాసాగే కథలకు బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి. అది ఈ సినిమాలో పూర్తిగా మిస్ అయింది.

ఫైనల్ గా: ప్రేక్షకులను కస్టడీ చేయలేకపోయారు

రేటింగ్: 2.5/5

బాబురావు. కామళ్ల

Related Posts