HomeMoviesటాలీవుడ్బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల కర్టన్ రైజర్ కార్యక్రమం

బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల కర్టన్ రైజర్ కార్యక్రమం

-

టాలీవుడ్‌లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరగబోయే వేడుక వివరాలను వెల్లడించేందుకు బుధవారం ఎఫ్‌ఎన్‌సీసీలో క్టరన్ రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్‌ను లాంచ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ.. ‘మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా నిరూపించుకున్నారు. మానాన్న గారికి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో నిలబడ్డారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నాన్నగారికి వారసుడిగా బాలకృష్ణ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హిందూపురం అడ్డా నందమూరి గడ్డ అని నిరూపించారు.’ అని చెప్పారు.

దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా కుర్రహీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే ఇన్ని ఏళ్లు నటుడిగా చేసిన వాళ్లు ఎవరూ లేరు. బాలయ్య స్కూలు వెళ్లేటప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక సామాన్యుడిలా తిరుగుతారు. చాలా సింప్లిసిటీగా ఉంటారు. మేమిద్దరం ఒకసారి గోవా వెళ్లినప్పుడు ఒక ట్రే వాటర్ బాటిల్స్ కొని ఆయనే మోసుకొచ్చారు. అంత సింపుల్‌గా ఉంటారు. బాలయ్య నిర్మాతల మనిషి. నాకు ఇష్టమైన నటుడు. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలి’ అని అన్నారు.

సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘బాలయ్యతో ఎక్కువ సినిమాలు చేసింది నేనే. 13 సినిమాలు ఆయనతో చేశానంటే ఆయన ఎంత మంచి వాడో అర్థమవుతుంది. అన్నగారి బాటలోనే బాలయ్య కూడా దర్శకులకు ఎంతో గౌరవం ఇస్తారు. 50 ఏళ్లు హీరోగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రస్థానంలో నేను కూడా ఉండడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ మధ్య ఎక్కడికెళ్లినా జై బాలయ్య అని అంటున్నారు. యూత్ నాడి పట్టుకున్న నటుడు బాలకృష్ణ. రామారావుగారి వారసుడిగా సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు.’ అని చెప్పారు.

ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 1న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మీ అందరి సహకారం కావాలని కోరుతున్నా’ అని చెప్పారు.

దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. ‘1974 మేలో గుడివాడలో తాతమ్మ కల సినిమా చూశా. అక్కడి నుంచి 50 ఏళ్లు మా కళ్ల ముందు గిర్రున తిరిగి ఇంత దూరం వచ్చేశామా అనేది ఒక కలలా అనిపిస్తోంది. అప్పుడు నేనొక లారీ డ్రైవర్ కొడుకుని. రామారావుగారి అభిమానిని. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చి ఇలా మీ ముందు మాట్లాడడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. నందమూరి బాలకృష్ణ గారికి తల్లిదండ్రులతో పాటు గురువు కూడా ఇంట్లోనే ఉన్నారు. అది ఆయన అదృష్టం. ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లోనూ ఆయన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆయన 50 ఏళ్ల వేడుక అందరికీ స్ఫూర్తిదాయంకంగా ఉండేలా జరగాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘నేను రామారావుగారి అభిమానిని. నేను అభిమానించిన రామారావుగారికి సినిమా రాయడం అనేది మాకు దొరికిన అదృష్టం. 1981లో నేను ఛండశాసనుడు సినిమాకు రాశాను. ఆ టైమ్‌లో ఒక అందమైన కుర్రాడు వచ్చాడు. అతనే బాలకృష్ణ. ఒకొక హీరోకు ఒక్కో బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అలా బాలయ్యకు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంది. తొడకొట్టే డైలాగ్ బాలయ్యకే సూట్ అవుతుంది. మేము రాసిన ప్రతి సినిమా బాలయ్యకు సక్సెస్ అయింది. 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడంటే నేను షాకయ్యా. 50 ఏళ్ల వయసు వచ్చిందేమో అనుకున్నా. అన్ని అసోసియేషన్స్ కలుపుకుని బాలయ్య 50 ఏళ్ల వేడకను ప్రపంచానికి తెలిసేలా చేయాలని కోరుతున్నా.’ అని చెప్పారు.

డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ..’50 నిమిషాల పాటు వాక్ చేస్తేనే మనం అలసిపోతాం. అలాంటిది ఆయన 50 ఏళ్లు సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి ఆయన కష్టాన్ని గుర్తించి సినిమా పెద్దలందరూ ఒక వేదిక మీదకు వచ్చి ఆయనకు సన్మానం చేయడం చాలా అభినందనీయమైన విషయం. ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చేసిన పాత్ర చేయకుండా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు 109 సినిమాలు పూర్తి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఎప్పుడూ ఇలా ఎనర్జిటిక్ గా ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సెప్టెంబర్ 1న ఘనంగా బాలకృష్ణ గారి నట జీవితానికి నిర్వహించే 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఇవీ చదవండి

English News