మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. అయితే.. గతంలో తన ఫింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై పలు వెబ్ సిరీస్ లు నిర్మించిన నిహారిక కు ఇదే తొలి ఫీచర్ ఫిల్మ్. ఈ సినిమా ద్వారా చాలామంది కొత్త వాళ్లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేసింది నిహారిక.
యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పేరున్న నటులంటే సాయికుమార్, శ్రీలక్ష్మి, గోపరాజు రమణ వంటి వారిని చెప్పొచ్చు. ఆద్యంతం గోదావరి జిల్లాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది.
అనుదీప్ దేవ్ సంగీతాన్నందించిన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. 90ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ సినిమాలోని ‘ఆ రోజులు మళ్లీ రావు‘ గీతానికి అయితే మంచి ప్రశంసలు దక్కాయి. ‘ఎ నోస్టాల్జిక్ రైడ్’ అంటూ వచ్చిన ‘కమిటీ కుర్రోళ్లు’ టీజర్ కూడా ఆద్యంతం గోదావరి జిల్లాల యాసతో, 90ల వాతావరణాన్ని ప్రతిబింబించే సన్నివేశాలతో ఆకట్టుకుంది.
‘కమిటీ కుర్రోళ్లు’ అనేది ఓ పల్లెటూరులో పన్నిండేళ్లకి ఒకసారి జరిగే అమ్మోరు జాతర నేపథ్యంతో రూపొందింది. ఈ జాతరలో బలిచేట అనేది ముఖ్యమైన ఘట్టం. అయితే.. కుల ఘర్షనలతో ఆ జాతర రక్త సిక్తమవుతుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన కుర్రాళ్ల మధ్య కులాలు చిచ్చులు పెడతాయి. మరి.. పన్నిండేళ్లకు ఒకసారి వచ్చే ఆ జాతరను ‘కమిటీ కుర్రోళ్లు’ జరిపించగలిగారా? అనేదే ఈ సినిమా కథ అని సోషల్ మీడియాలో రివ్యూస్ వస్తున్నాయి. మొత్తంమీద.. ఈ వారం హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోన్న ‘కమిటీ కుర్రోళ్లు’ పూర్తి రివ్యూ మరికొన్ని గంటల్లో రానుంది.