70వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించారు. 2022లో విడుదలైన ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటులకు సంబంధించిన విశేషాలను ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తెలుగులో ఉత్తమ చిత్రంగా ‘కార్తికేయ 2’కి అవార్డు లభించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ‘కాంతర’ చిత్రంలోని నటనకు గానూ రిషబ్ శెట్టి ని అవార్డు వరించింది. ఈసారి ఉత్తమ ఉత్తమ నటి అవార్డును ఇద్దరు నటీమణులకు ప్రకటించారు. ‘తిరుచిత్రమ్ బలం’ చిత్రానికి గానూ నిత్యామీనన్, ‘కచ్ ఎక్స్ ప్రెస్’ మూవీకి గానూ మానసి పరేఖ్ లను ఉత్తమ నటి అవార్డులు వరించాయి.
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు దక్కింది. దర్శకధీరుడు రాజమౌళి తీర్చిదిద్దిన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా ఆరు కేటగిరీల్లో అవార్డుల పంట పండించింది. ఇక.. ఇప్పుడు 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లోనూ తెలుగు సినిమాలకు స్థానం దక్కింది. 2022వ సంవత్సరానికి ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ అవార్డు సాధించింది.
నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందింది ‘కార్తికేయ 2’. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా లెవెల్ లో ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నిఖిల్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది.
కార్తికేయ అనే యువకుడు శ్రీకృష్ణుడి కడియం గురించిన రహస్యాన్ని వెతుకుతూ ప్రయాణం చేస్తాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొనే అద్భుతాలు, పరీక్షలు, ఆధ్యాత్మిక అంశాలే ‘కార్తికేయ 2’ కథాంశం. ద్వారక నగరం, శ్రీకృష్ణుడి జీవితం, పురాణాలకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను ఈ సినిమాలో చూపించారు. ఈనేపథ్యంలోనే.. ‘కార్తికేయ 2’ ఘన విజయాన్ని సాధించింది.
కన్నడతో పాటు తెలుగులోనూ ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘కాంతార’. 2022లో విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ దగ్గర నుంచి ప్రతీ విషయమూ ఓ సంచలనం అయ్యింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగానూ నటించాడు రిషబ్ శెట్టి. 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ‘కాంతార’ చిత్రంలోని నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు రిషబ్ శెట్టి. కన్నడ నుంచి మరో సెన్సేషనల్ హిట్ ‘కె.జి.యఫ్ 2’కి ఉత్తమ కన్నడ చిత్రంగా అవార్డు లభించింది.
తమిళ చిత్రాలు ‘తిరుచిత్రమ్ బలం, పొన్నియిన్ సెల్వన్ 1’కి కూడా అవార్డుల పంట పండింది. ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రానికి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా రవివర్మన్ కి అవార్డు దక్కగా.. ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా ఏ.ఆర్.రెహమాన్ కి అవార్డు దక్కింది. ‘తిరుచిత్రమ్ బలం’ సినిమాలోని నటనకు గానూ నిత్యామీనన్ ఉత్తమ నటిగా అవార్డు పొందగా.. ఇదే చిత్రానికి గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ను అవార్డు వరించింది.
స్పాట్.. ‘తిరుచిత్రమ్ బలం’ సాంగ్ విజువల్స్ ధనుష్, నిత్యామీనన్, రాశీ ఖన్నా సాంగ్ విజువల్స్
70వ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా మలయాళం సినిమా ‘ఆట్టమ్’ నిలిచింది. హిందీలో ‘గుల్ మొహర్’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కింది. ఉత్తమ సహాయ నటిగా ‘ఊంచాయి’ చిత్రానికి గానూ నీనా గుప్తా ఎంపికయ్యారు. ఉత్తమ సహాయ నటుడిగా పవర్ రాజ్ మల్హోత్రా ‘ఫౌజా’ సినిమాలోని నటనకు గానూ ఎంపికయ్యారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి గానూ ప్రీతమ్ కి అవార్డు దక్కింది.