2018 మూవీ రివ్యూ


తారాగణం : టోవినో థామస్, కుంచకో బోబన్, లాల్, అసిఫ్‌ అలీ, నరైన్, వినీత్ శ్రీనివాసన్, కలైరాసన్, అపర్ణ బాలమురళి తదితరులు
ఎడిటింగ్ : చామన్ చాకో
సినిమాటోగ్రఫీ : అఖిల్ జార్జ్
సంగీతం : నోబిన్ పాల్
నిర్మాతలు : వేణు కున్నుపల్లి, సికే పద్మకుమార్
దర్శకత్వం : జూడ్ ఆంథోనీ జోసెఫ్‌
తెలుగు అనువాద నిర్మాత : బన్నీవాస్

మళయాలం నుంచి వచ్చే సినిమాలు ఎంత క్వాలిటీగా ఉంటాయో అందరికీ తెలుసు. టెక్నికల్ గా ఎంత బ్రిలియంట్ గా ఉంటారో.. కంటెంట్ పరంగానూ ఎప్పుడూ అవుటాఫ్ ద బాక్స్ గా ఆలోచిస్తారు. అందుకే మాలీవుడ్ మూవీస్ అంటే దేశవ్యాప్తంగా ఓ క్రేజ్ఉంటుంది. ఆ క్రేజ్ ను ఎప్పటికప్పుడు డబుల్ చేస్తూనే ఉంటుంది మాలీవుడ్. ఆ క్రమంలో ఇప్పుడు ”2018″ అందరూ హీరోలే అనే సినిమాతో వచ్చారు. ఇప్పటికే ఈ చిత్రానికి రివ్యూస్ ద్వారా అద్భుతమైన టాక్ ఉంది. మరి ఈసినిమా ఎలా ఉంది..? 2018లో కేరళలో ఏం జరిగింది.

కథ :
2018 సినిమాను కథగా విభజించలేం. ఎందుకంటే ఇది కథ కాదు. కొన్ని వేల కుంటుబాల వ్యథ. చుట్టూ నీరు ముంచుకు వస్తోంటే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లా పాపలతతో బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తూ.. బ్రతికి ఉండగానే నరకాన్ని చూసిన కొన్ని వేలమంది వ్యథ. అయినా సింపుల్ గా చెబితే.. 2018 లో కేరళలో ఎన్నడూ లేనంత వరదలు వస్తాయి. దానికి తోడు అధికారుల అనాలోచిత చర్యల వల్ల కొన్ని వరద ప్రాంతాల్లోనే ఉన్న కొన్ని డ్యామ్ గేట్స్ కూడా ఎత్తేస్తారు.

దీంతో కొన్ని ప్రాంతాలన్నీ వరదతో పోటెత్తుతాయి. కొన్ని వేలమంది నిరాశ్రయులవుతారు. ఒక్క రాత్రిలోనే పెద్ద భీబత్సం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆ వరదల్లో చిక్కుకున్న వారు నరకం చూస్తారు. ఈ క్రమంలో అధికారులు, ఇతర దేశం స్పందించడానికి ముందే కేరళలోని జాలరులతో పాటు యువతరం కూడా కదిలి వచ్చి వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు మొదలుపెడతారు. ఈ క్రమంలో వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి సహాయాలు చేసుకున్నారు అనే కోణంలో కథ సాగుతుంది.

విశ్లేషణ :
2018 నిజంగా కొన్ని వేలమంది కొన్ని రోజుల పాటు అనుభవించిన వ్యథే. అయితే ఆ వ్యథను అలాగే చెబితే డాక్యుమెంటరీ అవుతుంది కదా..? అందుకే దర్శకుడు తెలివిగా ఈ కథను రకరకాల కోణాల్లో మొదలుపెట్టాడు. అలాగని హీరోలు, హీరోయిన్లూ అంటూ ఏం ఉండరు. రకరకాల ఊర్లలో రకరకాల మనుషుల జీవితాల్ని తెలుపుతూ.. వెళ్లాడు. ఓ ప్రేమకథ, ఓ జాలరి కుటుంబం కథ, భార్యపోయిన అసహనంలో కనిపించే లారీ డ్రైవర్, శెలవు దొరకని భర్తపై అలిగిన భార్య, భర్త వేరే దేశంలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీ, ఆర్మీ నుంచి పారిపోయి వచ్చిన ఓ కుర్రాడి కథ.. ఇలా ఈ మొత్తం కథలన్నీ కేరళలో “2018”లో వరదలు అనే థ్రెడ్ తో కలిపాడు.ఆ కలపడంలో దర్శకుడు చూపించిన తెలివికి హ్యాట్సాఫ్ చెప్పుకుండా ఉండలేం.


ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఎవరికి వారు మనం బ్రతికితే చాలు అనుకుంటారు. కానీ అందరం బ్రతకాలి అని కొందరే కోరుకుంటారు. ఆ కొందరికి కేరళలో కొదవ లేదు. అందుకే దేశం స్పందించడానికి ముందే కేరళ సమాజం తమవారిని కాపాడుకోవడానికి ముందుకు వచ్చింది. అన్ని వయసుల వారూ కదిలి వస్తారు. ముఖ్యంగా జాలరులు తమకు తాముగా సాయం చేస్తామని ముందుకు రావడం అనే ఎపిసోడ్ కమర్షియల్ సినిమాను తలపిస్తుంది. దానికి తోడు వారు సముద్రంలో చేసే సాహసాన్ని చూపించడానికి సినిమా ఆరంభంలోనే అద్భుతమైన ఎలివేషన్ సీన్ ఒకటి ఉంటుంది. వాళ్లు కదిలి రావడంతో అనేక గ్రామాల్లో ఆ బోట్స్ సాయంతో ఎంతోమందిని కాపాడతారు. ఒక ఒక ఊరిలో ఉండే ఆర్మీ నుంచి పారిపోయి వచ్చిన అనూప్ కు పెళ్లి కుదురుతుంది. ఈ క్రమంలో వరదలు చుట్టుముడతాయి. అప్పటి వరకూ అందరికీ సాయం చేసే అతను ఈ వరదల సమయంలో తన స్నేహతులతో కలిసి పెద్ద సాహసమే చేస్తాడు. వందల మందికి సాయం చేయడానికి వచ్చిన ఓ జాలరి తన ఇంట్లో విషాదాన్ని నింపుతాడు. ప్రభుత్వం కూడా స్పందిస్తూ ప్రజలకు క్యాంప్ లు ఏర్పాటు చేస్తుంది. ఇళ్లల్లో చిక్కుకుపోయిన వారిని ఈ క్యాంప్ లకు చేరవేయడం కోసం స్థానికులు చేసిన సాహసాలు చూస్తున్నంత సేపూ మనం కూడా ఆ వరదల్లోనే ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ సినిమాగా కాక కళ్ల ముందు జరుగుతున్న సత్యంలా కనిపిస్తాయి.


ఈ విషయంలో ప్రతి ఫ్రేమ్ నూ అత్యంత వాస్తవికంగా చిత్రించాడు దర్శకుడు. అందుకే అవి గ్రాఫిక్స్ లా ఎక్కడా కనిపించవు. నిజంగా అతని పర్ఫెక్షన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ కథలో ఎవరూ విలన్స్ ఉండరు. హీరోలూ ఉండరు. ఆపద సమయాల్లో ఒకరికి ఒకరు సాయంగా నిలిచిన కొందరు వ్యక్తుల కథను చెప్పాలుకున్నాడు. పైగా దీనికి నిజంగానే జరిగిన కేరళ వరదల నేపథ్యం కాబట్టి మరింత సహజంగా కుదిరింది. చాలా కథలు నిజంగా జరిగినవే కూడా. అందువల్ల ఆ నేచురాలిటీ కూడా ఉంటుంది.
మామూలుగా మళయాల చిత్రాలంటే కాస్త నెమ్మదిగా సాగే కథనం ఉంటుంది. ఈ చిత్రంలో ఆ కంప్లైంట్ లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ మొత్తం మనల్ని ఆ వరదల్లోనే ఉంచేస్తుందీ సినిమా.
నటన పరంగా ప్రధాన పాత్రలుగా కనిపించినవారే కాదు..జూనియర్ ఆర్టిస్టులు కూడా బాగా చేశారంటే ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడుదే. ఈ చిత్రం కోసం మూడున్నరేళ్లు కష్టపడ్డాడు దర్శకుడు. ఆ కష్టానికి అద్భుతమైన ఫలితం వచ్చిందనే చెప్పాలి.

ఫైనల్ గా : ఏ మస్ట్ వాచ్

రేటింగ్ : 4/5

            - బాబురావు. కామళ్ల

Related Posts