‘పుష్ప 2’ జాతర రచ్చ.. చిన్న సైజ్ సినిమా తీసినట్టే!

పేరుకు ఒక సినిమాకోసమే పనిచేసినా.. ఓ ఐదారు సినిమాలు తీసిన కష్టాన్ని తమ చిత్రం కోసం ఖర్చుపెడుతుంటారు దర్శకులు రాజమౌళి, సుకుమార్ వంటి వారు. ఒక్కో సీక్వెన్స్ కోసం ఓ చిన్న సైజ్ సినిమా చేసిన అనుభూతిని కలిగిస్తుంటారు. అందుకే.. వీరి సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు ఎవర్ గ్రీన్ గా నిలుస్తాయి. ‘బాహుబలి 1, 2’లలో ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అయినా.. క్లైమాక్స్ సన్నివేశాలు అయినా.. ‘ఆర్.ఆర్.ఆర్’లోని కీలకమైన సన్నివేశాలు అయినా అలాగ పుట్టినవే.

ఇప్పుడు రాజమౌళి బాటలోనే సుకుమార్ కూడా ‘పుష్ప 2’ కోసం అహర్నిశలు కష్టపడి చిత్రంలో కీలకమైన జాతర సీక్వెన్స్ ను తీర్చిదిద్దాడట. జాతర బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు, ఫైట్స్, సాంగ్.. అన్నీ కలిపి ఆ సీక్వెన్స్ కోసం.. ఓ మీడియం బడ్జెట్ కు మించిన రీతిలో ఖర్చుపెట్టించాడట సుకుమార్. ఇక.. జాతర సీక్వెన్స్ లో బన్నీ చేసే హడావుడి మామూలుగా ఉండదట. అల్లు అర్జున్ పుష్ప పాత్రలో చీరకట్టుకుని స్టెప్పులేయడం.. విలన్లును స్టైలిష్ గా చితక్కొట్టడం.. వంటి సన్నివేశాలు థియేటర్లలో విజిల్స్ వేయించేలా ఉండబోతున్నాయట.

అలాగే ఈ సీక్వెన్స్ లో వచ్చే పాట కోసం బన్నీ ఎంతో తీవ్రంగా కష్టపడ్డాడు. ఒకానొక దశలో బ్యాక్ పెయిన్ తో బాధపడ్డాడు. ఈ పాటకు పనిచేసిన కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ అయితే సుకుమార్ పై తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశాడనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నో పాటల కష్టాన్ని ఈ ఒక్క పాట కోసం పడ్డాడట గణేష్ మాస్టర్. అయినా.. అద్భుతమైన అవుట్ పుట్ చూసి అవన్నీ మర్చిపోయారట. మొత్తంగా.. ‘పుష్ప 2’కే సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచే జాతర సన్నివేశాల గురించి రెండు, మూడు నెలలుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి.. ఈ సీక్వెన్స్ థియేటర్లలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చూడాలి.

Related Posts