తెలుగు తెర నవ్వుల రారాజు

తెలుగు సినీ హాస్య లోకాన్ని ఏలిన నవ్వుల రారాజు రాజబాబు. ఆయన వెండితెరపై ప్రత్యక్షమైతే చాలు నవ్వని ప్రేక్షకుడు ఉండడు. తన అసామాన్య నటనతో తెలుగు ఇంటి లోగిళ్లలో నవ్వులు పువ్వులు పూయించిన రాజబాబు జయంతి అక్టోబర్ 20.

రాజబాబు ఇండస్ట్రీలోకి ఎంటరయ్యే సమయానికి రేలంగి, రమణారెడ్డి, అల్లురామలింగయ్య, పధ్మనాభం వంటి కామెడీ నటులు రాణిస్తున్నారు. అయితే చూడటానికి పీలగా పొట్టిగా ఉండే రాజబాబుకు ఉన్న పెక్యులర్‌ బాడీలాంగ్వేజ్‌ ఆయనకు తొందరగానే వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది. మొదట్లో చిన్న పాత్రలతో మొదలైన రాజబాబుకి జగపతి వారి ‘అంతస్తులు’ సినిమాలో చేసిన పనివాడి పాత్రకు మంచి గుర్తింపు లభించింది. అక్కడ నుంచి హార్దికంగా, ఆర్దికంగా కూడా రాజబాబు హవా మొదలైందనే చెప్పొచ్చు.

1960ల మొదట్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించిన రాజబాబు ఆ దశకం చివరికొచ్చేసరికి ఇండస్ట్రీలో టాప్‌ కమెడియన్‌గా ఎదిగాడు. కృష్ణ, శోభన్‌బాబు వంటి అప్పటి యంగ్‌ హీరోలతో పాటు ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి సీనియర్‌ హీరోలతో సరిసమానమైన క్యారెక్టర్స్‌లో నటించాడు. పెద్ద హీరో సినిమా కొనడానికొచ్చిన బయ్యర్లు ముందుగా రాజబాబు సినిమాలో ఉన్నాడా? లేడా? ఉంటే ఎన్ని సీన్లలో ఉన్నాడు అని వాకబు చేసి మరీ సినిమా కొనడానికి ముందుకొచ్చే వారంటే కమెడియన్‌ గా రాజబాబు సృష్టించిన నవ్వుల సునామి ఎటువంటిదో ఊహించవచ్చు.

అప్పటివరకు హీరోహీరోయిన్స్‌ నే హిట్‌ పెయిర్స్‌ గా సినిమా సక్సెస్‌ కు సెంటిమెంట్‌ గా భావించేవారు. అయితే రాజబాబు-రమాప్రభల కామెడీ జోడి నాటికి నేటికి సక్సెస్‌ పుల్‌ హిట్‌ పెయిర్స్‌లో ఒకరు. కమెడియన్‌ కు హీరో స్టేటస్‌ కల్పించి రాజబాబు హీరోగా కూడా మంచి సక్సెస్‌ సాధించాడు. దాసరి డైరెక్ట్‌ చేసిన తొలి సినిమా ‘తాతామనవడు’లో హీరో రాజబాబు కావడం విశేషం. రాజాబాబు హీరోనా అని గుసగుసలాడిన వాళ్ళ నోర్లు మూతపడేలా తాను కామెడీ మాత్రమే కాదు హీరోగా కూడా రాణించగలనని ప్రూవ్‌ చేశాడు.

నటుడిగా ఎంతో ఉన్నతికి ఎదిగినా తన మూలాలను మరచిపోని వ్యక్తి రాజబాబు. నలుగురికి సహాయపడాలనే తత్వం కల్గిన రాజబాబు ఎన్నో ధార్మిక కార్యక్రమాలతో పాటు ఎన్నో గుప్తదానాలు కూడా చేశాడు. 1983న తన 45 ఏట హైదరాబాదులోని థెరెసా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. అతి తక్కువ సమయంలోనే దాదాపు 600 చిత్రాల్లో నటించిన రాజబాబు నటనకు రీప్లేస్‌ మెంట్‌ లేదు.

Related Posts