‘గాంజా శంకర్‘గా ఊరమాస్ లుక్ లో సాయితేజ్

బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష‘గా ప్రేక్షకుల్ని ముందుకొచ్చాడు. మిస్టిక్ థ్రిల్లర్ గా వచ్చిన ‘విరూపాక్ష‘ అఖండ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో‘ మూవీ చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు ఊర మాస్ లుక్ లో ‘గాంజా శంకర్‘గా సిద్ధమవుతున్నాడు సాయితేజ్.

గతంలో రామ్ చరణ్ కి ‘రచ్చ‘ వంటి హిట్ ఇచ్చిన సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈరోజు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు.. ‘గాంజా శంకర్‘ ఫస్ట్ హై పేరుతో ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో ‘స్పైడర్ మ్యాన్ లు, సూపర్ మ్యాన్ లు కాదు నాన్న.. మన లోకల్ మ్యాన్ కథ ఉంటే ఏదైనా చెప్పంటూ తన తండ్రిని ఓ పాప అడగడంతో..‘ గ్లింప్స్ స్టార్ట్ అయ్యింది. అయితే.. నీకొక సుప్రీమ్ హీరో కథ చెప్తానంటూ.. ‘ఆడు చిన్నప్పుడే చదువు బంద్ చేసిండు..
అమ్మా నాయనలు చెబితే వినడం లేదు.. అడ్డమైన తిరుగళ్లంతా తిరుగుతడు.. ఇక సరసాలు.. సరదాలు.. గుట్కాలు.. తాగుడు.. మందు.. మసానం.. ఆడికి లేని దరిద్ర్యపు అలవాట్లంటూ లేవు.. ‘ అంటూ ఆ తండ్రి ‘గాంజా శంకర్‘ స్టోరీ మొదలెట్టడం ఈ గ్లింప్స్ లో ఆకట్టుకుంటుంది. గాంజా శంకర్ గాంజా అమ్మడం.. పోలీసులు అతని వెనుకబడడం వంటి విజువల్స్ కూడా గ్లింప్స్ లో కనిపించాయి.

సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంమీద.. మొదటిసారి సాయిధరమ్ తేజ్ ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్న చిత్రమిది. మరి.. ఈ మూవీతో సుప్రీమ్ హీరో మెగా హిట్ కొట్టాలని ఆశిస్తూ సాయిధరమ్ తేజ్ కి బర్త్ డే విషెస్ చెబుదాం.

Related Posts