ఈ మధ్య కాలంలో వస్తోన్న చిన్న సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించడం లేదు. ఓ వైపు సమ్మర్ లో అసలుపెద్ద సినిమాలేం లేవు. ఈ అవకాశాన్ని వాడుకోవల్సిన చిన్న సినిమాలు మాత్రం అదే రొటీన్ స్టఫ్ తో కావాల్సినంతగా ఇరిటేట్ చేస్తున్నాయి. ఈ శుక్రవారం వచ్చిన తెలుగు చిత్రాలు కూడా నిరుత్సాహపరిచాయి. ముఖ్యంగా నానా హడావిడీ చేస్తూ వచ్చిన మళ్లీ పెళ్లి కావాల్సినంతగా ఇబ్బంది పెట్టింది.

నరేష్ తను గొప్ప సచ్ఛీలుడను అని చెప్పుకోవడానికి.. ఇంకా చెబితే తనకు తానుగా డబ్బా కొట్టుకోవడానికే ఈ చిత్రాన్ని రూపొందించినట్టు అర్థమైంది. అంతేకాక తమది అత్యంత పవిత్రమైన ప్రేమ అని చెప్పాలనుకున్నాడు. ఓ రకంగా నరేష్‌- పవిత్రల బయోపిక్ లాంటిది అని చెప్పే అవకాశం ఉన్న ఈ మూవీ పూర్తిగా ఒన్ సైడెడ్ గా ఉండటంతో ఆడియన్స్ కు తలనొప్పి తప్ప ఎంటర్టైన్మెంట్ దొరకలేదు.


ప్రమోషన్స్ లో కొత్త పంథాను పరిచయం చేస్తూ దాదాపు ఇండస్ట్రీలోని చాలామందిని ప్రమోషన్స్ కోసం వాడుకుని యూత్ లో కాస్త క్రేజ్ తెచ్చుకున్న సినిమా మేమ్ ఫేమస్. సుమంత్ ప్రభాస్ అనే కుర్రాడు హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని చాయ్ బిస్కట్ వాళ్లు నిర్మించారు. అయితే ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదు అనిపించుకున్న ఈ చిత్రం సెకండ్ హాఫ్‌ లో గాడి తప్పింది. సెకండ్ హాఫ్‌ లో దర్శకుడు పూర్తిగా తన కమాండ్ కోల్పోయాడు. పైగా ఫేమస్ అయ్యేందుకు చేసిన ఐడియాస్ అన్నీ తుస్ మన్నాయి. అవేవీ ఆకట్టుకోకపోగా.. ఈ మాత్రానికే ఫేమస్ అయిపోతారా అని కూడా అనిపిస్తుంది. చేసిన ప్రమోషన్స్ కు ఫలితం అన్నట్టుగా మొదటి రోజు కోటి రూపాయలు గ్రాస్ వసూలైంది అని పోస్టర్ వేసుకున్నారు కానీ అది నిజం కాదు అనేది ట్రేడ్ చెబుతోన్న మాట. ఇంకా చెబితే నైజాంలో తప్ప ఈ చిత్రాన్ని ఏ ఏరియాల్లోనూ పెద్దగా పట్టించుకోలేదు కూడా.


ఇక ఎఫ్‌2, సేవ్ ద టైగర్స్ రూట్ లో వచ్చిన మరో సినిమా ‘మెన్ టూ’. మగవాళ్ల బాధల గురించి ఏకరువు పెడుతూ వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ను బాధపెట్టడం తప్ప చేసిందేం లేదు. ఏ మాత్రం ఆకట్టుకోని కథ కథనాలు.. మచ్చుకు కూడా కొత్తదనం కనిపించిన సినిమాగా ప్రేక్షకులు తీసేపడేస్తున్నారీ చిత్రాన్ని.


ఈ మొత్తంలో డబ్బింగ్ సినిమాగా వచ్చిన మళయాల మూవీ 2018 మాత్రమే బెటర్. ఏ వర్గం ప్రేక్షకులనైనా ఆకట్టుకునే అంశాలు ఉన్నాయీ చిత్రంలో. అద్భుతమైన మేకింగ్, రియలిస్టిక్ అప్రోచ్, గ్రేట్ విజువల్స్ ఈ మూవీకి హైలెట్స్. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీని మస్ట్ వాచ్ గా చెప్పొచ్చు. మొత్తంగా ఈ శుక్రవారం వచ్చిన తెలుగు సినిమాలన్నీ తేలిపోతే.. ఈ డబ్బింగ్ సినిమా మాత్రం గట్టెక్కిందని చెప్పొచ్చు.

, , , , , , , , , , ,