ఏదైనా పెద్ద పండ‌గ వ‌స్తోందంటే చాలు.. వ‌రుస‌గా సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తుంటారు మేక‌ర్స్. కొందరైతే నెల‌లు ముందుగానే రిలీజ్ డేట్స్ ప్ర‌క‌టిస్తుంటారు. అదే టైమ్ లో తీరా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌కు రాగానే త‌ప్పుకునే వారూ ఉంటారు. అలా ఎప్పుడో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమా స‌ర్దార్. కార్తీ హీరో న‌టించిన సినిమా ఇది. కార్తీ స‌ర‌స‌న ర‌జీషా విజ‌య‌న్, రాశిఖ‌న్నా హీరోయిన్లుగా న‌టించారు.

పిఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌కుడు. మిత్ర‌న్ గ‌తంలో అభిమ‌న్యుడు, హీరో సినిమాల‌ను రూపొందించాడు. రెండు భిన్న‌మైన బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చిన ఈ రెండు సినిమాలూ తెలుగులోనూ మంచి విజ‌యాలు సాధించ‌డం విశేషం. ఇకి సినిమాలో కార్తీ డ్యూయొల్ రోల్ లో న‌టించాడు. ఒక పాత్ర రా ఏజెంట్ అయితే మ‌రోటి ఐపిఎస్ ఆఫీస‌ర్. ఈ రెండు పాత్ర‌ల్లోనూ డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపిస్తాడ‌ని.. ట్రైల‌ర్ చూస్తే తెలుస్తోంది. కార్తీ ఒక సినిమాలో ఇన్ని గెట‌ప్స్ లో న‌టించ‌డం విశేషం.

మొత్తంగా ప్ర‌స్తుతం పొన్నియ‌న్ సెల్వ‌న్(త‌మిళ్) విజ‌యాన్ని ఆస్వాదిస్తోన్న కార్తీ త‌న స‌ర్దార్ చిత్రాన్ని ఈ నెల 21 విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మామూలుగా గ‌తంలో దీపావ‌ళి రోజ‌నే రిలీజ్ అన్నారు. కానీ కాస్త ముందుకు వ‌చ్చి 21న విడుద‌ల చేస్తున్నారు.


ఇక స‌ర్దార్ కు పోటీగా తెలుగు నుంచి మంచు విష్ణు జిన్నా ఉంది. జి నాగేశ్వ‌ర్ రెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సూర్యా డైరెక్ట్ చేసిన సినిమా ఇది. స‌న్నిలియోన్, పాయ‌ల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా న‌టించారు. ఆ మ‌ధ్య విడుద‌లైన ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. విష్ణు ఫ‌స్ట్ టైమ్ హార‌ర్ కామెడీ మూవీ చేసిన‌ట్టుగా అర్థ‌మౌతోంది.
ఇక విశ్వ‌క్ సేన్ రీమేక్ మూవీ ఓరి దేవుడా కూడా 21నే విడుద‌ల కాబోతోంది.

విశ్వ‌క్ సేన్ స‌ర‌స‌న మిథిలా పాల్క‌ర్, ఆశాభ‌ట్ హీరోయిన్లుగా న‌టించారు. త‌మిళ్ లో సూప‌ర్ హిట్ అయిన ఓ మై క‌డ‌వులేకు రీమేక్ ఇది. దేవుడు పాత్ర‌లో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించాడు. త‌మిళ్ చిత్రాన్ని రూపొందించిన అశ్వ‌త్ మారిముత్తే తెలుగులోనూ రూపొందించాడు. ఈ మూవీ ట్రైల‌ర్, పాట‌ల‌కూ మంచి స్పంద‌న వ‌స్తోంది. షూర్ హిట్ గా చెబుతున్నారు చాలామంది.


త‌మిళ్ లో మంచి ఇమేజ్ ఉన్న శివ‌కార్తికేయ‌న్ ఫ‌స్ట్ టైమ్ తెలుగు సినిమాలో న‌టించాడు. జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా అదే రోజు తెలుగుతో పాటు త‌మిళ్ లోనూ విడుద‌ల కాబోతోంది. వీళ్లింకా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. మ‌రి ఈ మూవీస్ లో దీపావ‌ళి ధ‌మాకాగా బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్ సౌండ్ చేసే చిత్రాలేంటో చూడాలి.

,