బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటిన హీరో ప్రభాస్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తూ వస్తున్నారు. సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. అయితే అవి ఆశించిన స్థాయిలో విజయాలు దక్కించుకోలేదు. ఇంకా సలార్, ప్రాజెక్ట్ K సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇది కాకుండా ఆది పురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇది కాకుండా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. అలాగే ప్రభాస్ తన 25వ సినిమాగా సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్‌ను చేయబోతున్నారు.

ప్రభాస్ లైనప్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. అయితే ఈ గ్యాప్‌లో ప్రభాస్ ఓ చిన్న దర్శకుడితో పని చేయబోతున్నారు. ఆ దర్శకుడు ఎవరో కాదు.. మారుతి. త్వరలోనే వీరి సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. కానీ.. ఎక్కడా చిన్న ఫొటోను కూడా లీక్ చేయలేదు. సలార్, ప్రాజెక్ట్ K గ్యాప్‌లో.. అతి తక్కువ రోజుల్లోనే మారుతి సినిమాను పూర్తి చేయటానికి ప్రభాస్ ఓకే చెప్పటమే కాదు.. షురూ కూడా చేసేశాడు.

కాగా.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ప్రభాస్ – మారుతి సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారట. అది కూడా తాత, మనవడిగా.. ఈ రెండు పాత్రలను ప్రభాసే చేయబోతున్నారట. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు టాక్. బిల్లా, బాహుబలి సినిమాల్లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశారు. తర్వాత మళ్లీ ఇప్పుడు డార్లింగ్ ద్విపాత్రాభినయంతో మెప్పించబోతున్నారు. నిజానిజాలేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.