ad

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన‌ హ్యాట్రిక్ మూవీ అఖండ. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 2న విడుదలైన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుని విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భగా హైదరాబాద్‌లోని ఆర్.టి.సి. క్రాస్ రోడ్‌లో గల సుదర్శన్ 35.ఎం.ఎం. థియేటర్లో అఖండ చిత్రం అర్థ శతదినోత్సవ వేడుక ఘ‌నంగా జరిగింది. అయితే… ప్రేక్షకులు అఖండ సినిమా చూస్తుండగానే బాలకృష్ణ విచ్చేసి అభిమానులను అలరించారు.

ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ…. ఆర్.టి.సి. క్రాస్ రోడ్‌కి వస్తుంటే మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. స్టూడియోలో నాన్నగారి కోసం టిఫిన్ తీసుకు వచ్చేవాడిని. అలాగే ఇక్కడ‌కు వ‌స్తుంటే… సమరసింహారెడ్డి శతదినోత్స వేడుక కూడా గుర్తుకువ‌చ్చింది. ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మా టీమ్ సమిష్టి కృషి. శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తుచేసుంటూ వాటిని పోషించాను. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు అఖండ పండుగ ఇది.

కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు. ఇది ఆంధ్ర, తెలంగాణే కాదు, కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా అలాగే యావత్ ప్రపంచ పండుగ అఖండ అర్థ శతదినోత్సవం. ఈ వేడుకను పలుచోట్ల అభిమానులు జరుపుకుంటున్నారు. అందుకు గర్వంగా వుంది. ఈ సినిమా విజయాన్ని చేసేలా సహకరించిన ఆది దంపతులకు కృతజ్ఞతలు. ఇక బోయపాటి శ్రీను, నా కాంబినేషన్ హాట్రిక్. మా కలయిక జన్మజన్మలది. అందుకే ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు.

మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. నాకు నాన్నగారు ఆదర్శం. ఈ అఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం. ఈ సినిమాలో తీసుకున్న అంశం హిందూ సమాజం, ధర్మం, పద్ధతులు. వాటిజోలికి ఎవరైనా వస్తే దేవుడు అఖండలా వచ్చి వారికి బుద్ధి చెబుతాడు. కలుషితమైనపోయిన సమాజానికి ప్రక్షాళ‌న‌గా ఈ సినిమా వుంది.

ఈ సినిమా ఇంత అద్భుతమైన విజయానికి కారకులు అభిమానులు, ప్రేక్షకులే. ఇది పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ వరల్డ్ సినిమా. ఇక తమన్ సంగీతం ఈ చిత్రానికి అదరగొట్టేలా చేసింది. రిలీజ్ కాకముందు ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నారు. రిలీజ్ అయ్యాక థమన్ సంగీతంలా అదిరింది అన్నారు. తెలుగు పరిశ్రమ ఇలాగే మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండాలి అన్నారు. అనంతరం అఖండ‌ యాభైరోజుల జ్ఞాపికలను బాలకృష్ణ ఎగ్జిబిటర్లకు పంపిణీదారులకు అందజేశారు.

, , , , , , , , , , , , , , , , , , ,