ఓ పెద్ద పండగ వస్తోందంటే ఏ ఏ సినిమాలు విడుదలవుతున్నాయా అని ఆడియన్స్ ఆసక్తిగా చూస్తుంటారు. దసరా లాంటి సీజన్ కు స్టార్ హీరోలే సందడి చేస్తారు. ఈ వార్ ఎప్పుడో ఫైనల్ అయినా.. ఇంకా ఎంతమంది బరిలో ఉన్నారు అనేది రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చిన తర్వాతే తేలిపోతుంది. అలా ఈ దసరాకు కూడా నాలుగు సినిమాలు రేస్ లో ఉన్నాయి. ఇద్దరు వెటరన్ స్టార్స్ తో పాటు ఓ మీడియం రేంజ్ మరో మినీ రేంజ్ మూవీ బాక్సాఫీస్ వార్ లోకి దిగుతున్నాయి. మరి ఆ సినిమాలేంటీ.. వీటి విజయావకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
గాడ్ ఫాదర్.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా. మళయాల బ్లాక్ బస్టర్ లూసీఫర్ కు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం ఇది.

దసరా రోజు అక్టోబర్ 5న విడుదల కాబోతోంది. మెగాస్టార్ తో పాటు నయనతార, సత్యదేవ్, సునిల్, పూరీ జగన్నాథ్ కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ గా కనిపిస్తాడు. మోహన్ రాజా డైరెక్ట్ చేశాడు. ఇక లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ చూస్తే ఓ రేంజ్ లో కనిపిస్తోంది. మెగాస్టార్ కు ఆచార్య అనుభవాన్ని మరిపించేలా కనిపిస్తోందంటున్నారు. కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ లా ఉంది. అయితే చిరు కెరీర్ లో ఫస్ట్ టైమ్ అసలు హీరోయిన్ లేకుండా వస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పటికైతే సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటిని అందుంటాడా లేదా అనేది మొదటి ఆటతోనే తేలిపోతుంది.


మెగాస్టార్ తో పాటు వస్తోన్న మరో వెటరన్ స్టార్ నాగార్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఘోస్ట్ మూవీతో నాగ్ కూడా అక్టోబర్ 5నే వస్తున్నాడు. ఆ మధ్య ఈ సినిమాను అక్టోబర్ 7కు విడుదల చేస్తారు అనే వార్తలు వచ్చాయి. బట్ అప్పటికే హాలీడేస్ మూడ్ పోతుంది. అందుకే పండగ రోజే వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఘోస్ట్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అందుకే తెలుగుతో పాటు హిందీ, తమిళ్ లోనూ విడుదల చేస్తున్నారు. నాగ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. స్టైలిష్‌ యాక్షన్ థ్రిల్లర్ లా కనిపిస్తోందీ సినిమా. ఘోస్ట్ పైనా అంచనాలు బాగా ఉన్నాయి.


ఈ ఇద్దరికీ పోటీగా దసరా బరిలోకి దిగుతున్నాడు జిన్నా. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రానికి ఇషాన్ సూర్యా దర్శకుడు. పాయల్ రాజ్ పుత్, సన్నిలియోన్ హీరోయిన్లుగా నటించారు. గతంలో విడుదలైన టీజర్ తో జిన్నా ఓ కామెడీ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. సినిమాపై అంచనాలు పెంచేంత స్టఫ్ ఇప్పటి వరకూ రాలేదు కానీ.. ఓ రకంగా మూడో సినిమాగా మాత్రం జిన్నా కనిపిస్తున్నాడు.


ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వస్తోన్న మరో సినిమా స్వాతిముత్యం. నిర్మాత బెల్లంకొండ సురేష్‌ రెండో కొడుకు గణేష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. గణేష్‌ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ఈ ముగ్గురి మధ్య చిన్న హీరో పెద్ద విజయం సాధిస్తాడా లేదా అనేది అక్టోబర్ 5న తేలిపోతుంది.


మొత్తంగా దసరా బరిలో వస్తోన్న సినిమాల్లో మెగాస్టార్ గాడ్ ఫాదర్ పై భారీ అంచనాలున్నాయి. ప్రమోషన్స్ పరంగానూ ఆయనే ఇప్పటి వరకూ ముందున్నాడు. లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో చాలామంది నమ్మకంగా ఉన్నారు. మరి ఈ నాలుగు సినిమాల్లోనూ ది బెస్ట్ అనిపించుకునేది ఎవరో చూడాలి.

, , , , , , , , , , , , , , , , , , , , , , , , ,