ad

ఆగస్ట్.. తెలుగు సినిమా పరిశ్రమ అంతా ఇప్పుడు ఈ నెలను పలవరిస్తోంది. ఎందుకంటే ఈ నెలలోనే ఆడియన్స్ లో ఇప్పటికే కాస్త క్రేజ్ తెచ్చుకున్న మీడియం రేంజ్ సినిమాలు వస్తున్నాయి. ఇక వచ్చే శుక్రవారం బింబిసార, సీతారామం రెండు భిన్నమైన జానర్స్ గా వస్తున్నాయి. ఆ తర్వాత వచ్చే వారం మాత్రం ఓ రకమైన పోటీ ఉన్న సినిమాలున్నాయి. అంటే ఖచ్చితంగా ఒకరిపై ఒకరు పై చేయి సాధించాల్సిందే అనేలా ఈ పోటీ కనిపిస్తోంది. అందుకే ప్రమోషన్స్ పరంగా దూసుకుపోతున్నారు. వీరిలో హిందీ మూవీ లాల్ సింగ్ చడ్డా కూడా తగ్గేదే లేదు అని తెలుగు మార్కెట్ పై గట్టి ఫోకస్ పెట్టాడు.
నితిన్ కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు చూస్తున్నారు. అతనికి ఫ్లాపులు కొత్త కాదు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారింది. ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. హిట్టు కొట్టాల్సిందే అనే పరిస్థితి ఉందిప్పుడు. అందుకే ఇకపై లవ్ స్టోరీస్ గట్రా చేయనని.. ఓన్లీ యాక్షన్ అంటూ మాచర్ల నియోజకవర్గం అంటూ రంగంలోకి దిగాడు. యంగ్ కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. నితిన్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో నితిన్ ఖచ్చితంగా హిట్ కొడతాను అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. మరి అతనికి ఉన్న పోటీలో అది సాధ్యమా అనేది ఆగస్ట్ 12న తేలిపోతుంది.
నితిన్ కు పోటీగా బరిలోకి దిగుతున్నాడు నిఖిల్. కార్తికేయ2 తో మరోసారి ప్రేక్షకులను మాయ చేసేందుకు ఈ టీమ్ రెడీ అవుతోంది. ఆల్రెడీ కార్తికేయ బ్లాక్ బస్టర్ కావడం ఈ సినిమాకు పెద్ద ఎసెట్. చందు మొండేటి డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రానికి అభిషేక్ నామా నిర్మాత. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ అంచనాలను పెంచింది. మరోసారి మ్యాజిక్ రిపీట్ అవుతుంది అనే కలర్ కనిపించింది. ఫస్ట్ పార్ట్ లో యానిమల్ హిప్నాటిజం అంటూ ఓ గుడిలో జరిగిన దోపిడీని చూపించిన టీమ్ ఈ సారి ఏకంగా శ్రీ కృష్ణ జన్మస్థానం పై ఓ కొత్త కంటెంట్ తో వస్తున్నట్టు కనిపిస్తోంది. కాంట్రవర్శీస్ లేని కంటెంట్ అయ్యి.. కనెక్ట్ అయితే ఇప్పుడు ఇండియాలో ఉన్న మూడ్ ను బట్టి కశ్మిర్ ఫైల్స్ లా ప్యాన్ ఇండియన్ మూవీ అయినా ఆశ్చర్యం లేదు.
ఇక వీరితో పాటు బరిలో ఉన్నాడు.. ఆమిర్ ఖాన్. ఆగస్ట్ 11నే లాల్ సింగ్ చడ్డాతో వస్తున్నాడీ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. నాగ చైతన్య ఓ కీలకమైన పాత్రలో నటించిన ఈ సినిమాను తెలుగులో ఎక్కువగా ప్రమోట్ చేస్తుండటం విశేషం. అందుకు మెగాస్టార్ కూడా యాడ్ అయ్యాడు. ఆమిర్ కు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ తనే సమర్పకుడుగా మారాడు. మరోవైపు ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని నార్త్ బెల్ట్ లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు కొందరు. అలా చేయొద్దని వేడుకుంటున్నాడు ఆమిర్. అది కూడా సినిమాకు ప్లస్ అవుతుందనే చెప్పాలి. హాలీవుడ్ హిట్ మూవీ ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా వస్తోన్న లాల్ సింగ్ చడ్డా తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు ఆమిర్. పైగా ఆమిర్ కు ఇక్కడా మంచి అభిమానులే ఉన్నారు.
మొత్తంగా ఈ మూడు సినిమాలతో పాటు గతంలో సమంత నటించిన యశోద కూడా అదే డేట్ కు అనౌన్స్ అయింది. కానీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వీరి తర్వాతి రోజు బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు నటించిన స్వాతిముత్యం రాబోతోంది. దీనికి సంబంధించి ఎలాంటి సౌండ్ లేదు. సో రాకపోవచ్చు. అందువల్ల ఈ మూడు సినిమాల మధ్యే పెద్ద పోటీ ఉంటుంది. మరి ఈ కాంపిటీషన్ లో నెగ్గి బాక్సాఫీస్ కు తమ ఖలేజా చూపించేది ఎవరో కానీ.. ప్రమోషన్స్ పరంగా మాత్రం ఓ రేంజ్ లో పోటీ పడుతున్నారు. అయితే ఈ మూడు సినిమాలూ మంచి విజయమే సాధించాలని మనం కోరుకుందాం..

, , , ,