నోట్ల ర‌ద్దు… మోడీపై విచార‌ణ‌!

పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంలో ప్ర‌ధాని మోడీ విచార‌ణ ఎదుర్కోనున్నారా? ఈ ప్ర‌శ్న‌కు అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. పార్ల‌మెంట‌రీ ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ(పీఏసీ) త‌మ ఎదుట హాజ‌రై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా ప్ర‌ధానిని కోరే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లొస్తున్నాయి. ఇప్ప‌టికే ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ ఊర్జిత్ ప‌టేల్‌కు పీఏసీ నోటీసులిచ్చింది. నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంలో ఆర్‌బీఐ వ్య‌వ‌హ‌రించిన తీరుపై ప‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తూ వాటికి జ‌వాబులు చెప్పాల‌ని పీఏసీ కోరింది. డిసెంబ‌రు 30న ఈ మేర‌కు నోటీసులు పంపిన పీఏసీ… జ‌న‌వ‌రి 20న ఊర్జిత్ ప‌టేల్‌ను త‌మ ఎదుట హాజ‌రు కావాల‌ని కూడా ఆదేశించింది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కూ ఊర్జిత్ ప‌టేల్ దానిపై స్పందించ‌లేదు.

అయితే, ఊర్జిత్ వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చినా ప్ర‌ధాని మోడీని కూడా ఈ క‌మిటి ప్ర‌శ్నించే అవ‌కాశం లేక‌పోలేద‌ని తెలుస్తోంది. దీనికి కార‌ణం నోట్ల రద్దు త‌న సొంత నిర్ణ‌య‌మ‌ని అందులో కష్ట న‌ష్టాల‌కు తానే బాధ్యుడిన‌ని మోడీ ప‌దేప‌దే చెబుతున్న సంగ‌తి తెలిసిందే. నోట్ల ర‌ద్దు గ‌డువు ముగిసి ప‌ది రోజులు పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కూ దానివ‌ల్ల సాధించింది ఏమిట‌నే దానిపై ప్ర‌ధాని, ఆర్‌బీఐ, ప్ర‌భుత్వం ఎవ‌రూ పెద‌వి విప్పడం లేదు. ఈనెల 20న జ‌రిగే పీఏసీ సమావేశానికి ఉర్జిత్ పటేల్, ఆర్థిక శాఖ అధికారులు అలోక్ లవస, శక్తికాంత్ దాస్ హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం.

ఈ నేపధ్యంలోనే నోట్ల రద్దు నిర్ణయంపై అవసరమైతే పీఏసీ ముందుకు ప్రధానిని పిలిపించే అధికారం తమకు ఉందని పీఏసీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నేత కేవీ థామస్ తెలిపారు. ‘మేము పంపించిన ప్రశ్నలకు ఇంకా సమాధానం రాలేదు. 20వ తేదీ సమావేశంలోపు సమాధానాలు పంపుతారని అనుకుంటున్నారు. వారిచ్చిన సమాధానాలపై కూలంకషంగా చర్చిస్తాం’ అని చెప్పారు. 20నాటి సమావేశం త‌ర్వాత‌ నోట్ల రద్దు అంశంపై ప్రధానిని పిలవాలని సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయిస్తే మోడీని కూడా పిలుస్తాం’ అని థామస్ చెప్పారు.

Leave a Reply

*