కిలో చికెన్ 900… కోడిగుడ్డు 45!

ఎక్క‌డైనా విన్నారా ఈ ధ‌ర‌. మ‌ట‌న్ బోన్‌లెస్ కూడా ఆరోంద‌ల‌కు మించి ఉండ‌దు. అలాంటి ఆఫ్ట్రాల్ కోడి మాంసం కిలో తొమ్మిది వంద‌లా. అఫ్ట్రాల్ అని తీసిపారేయ‌కండి. ఈ చికెన్ సంగ‌తే వేరు. అందుకే దీనికి అదిరిపోయే ధ‌ర. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన క‌డ‌క్‌నాథ్ అనే ఈ ప్ర‌త్యేక జాతి కోడికి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. అందులో ఉన్న ప్ర‌త్యేక‌త‌లు అలాంటివి మ‌రి. హైదరాబాద్‌లో ఈ కోడి మాంసం ప్ర‌స్తుతం కిలో రూ.900కు హాట్‌ కేకులా అమ్ముడవుతోంది. బిగ్‌బాస్కెట్‌ వంటి ఆన్‌లైన్‌ సైట్స్‌లోనూ చాలా కాలంగా ఈ చికెన్ అమ్మేస్తున్నారు. న‌ల్లగా ఉండ‌డం దీని ప్రాథ‌మిక ల‌క్ష‌ణం. చ‌ర్మ‌మే కాదు… లోప‌లి కండ‌.. ఎముక‌లు అన్నీ న‌ల్ల‌గానే ఉంటాయి.

వీటికి ఎందుకింత ఎక్కువ ధ‌ర అంటే… ఈ మాంసంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌ట‌. వాస్త‌వంగా అంత‌రించిపోతున్న క‌డ‌క్‌నాథ్ కోళ్ల సంర‌క్ష‌ణ‌, పెంప‌కాన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో ప్రోత్స‌హిస్తోంది. ఈ కోడి మాంసంలోని ఔష‌ధ‌గుణాల‌ను దేశ‌వ్యాప్తంగా ప్ర‌త్యేకంగా ప్ర‌చారం క‌లిపిస్తోంది. దాంతో ఇప్పుడు ఈ కోళ్ల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ దారిలోనే త‌మిళ‌నాడు స‌హా మ‌రికొన్ని ప్రాంతాల‌లో ఈ కోళ్ల పెంప‌కం జోరుగా సాగుతోంది. ఎనిమిదేళ్ల జీవిత‌కాలం ఉండే ఈ కోళ్లు 45 రోజుల్లో రెండున్న‌ర కిలోల బ‌రువు పెరుగుతాయి. ఈ చికెన్‌లో పోష‌కాలు కూడా మామూలు కోడితో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ‌గా ఉంటాయి.

ఫాట్ ప‌ర్సంటేజ్ అతి త‌క్కువ‌గా ఉండి మాంసకృత్తులూ ఎక్కువగా ఉండడంతో ఈ మాంసానికి విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. ఈ కోడి మాంసం తిన‌డం వ‌ల్ల జీర్ణశక్తితోపాటు వ్యాధి నిరోధక శక్తీ పెరుగుతుందన్న భావన ఉంది. ఈ కోడి మాంసంలో ఉన్న ఔషధ గుణాలను పరిశీలించి… క్రీడాకారుల డైట్‌ చార్ట్‌లో చేర్చాలని దేశ మాంస పరిశోధన సంస్థ సిఫారసు చేసింది. కోడే కిలో తొమ్మిదొంద‌లు ఉంటే.. దాని గుడ్డు.. అది కూడా అదిరిపోయే ధ‌రే. ఒక్క గుడ్డు ధ‌ర 45 రూపాయ‌లు.

Leave a Reply

*